పంజాబ్ సరిహద్దులో పాక్ బోట్ తో కలకలం 

భారత్‌ – పాక్‌ సరిహద్దును ఆనుకొని ఉన్న బమియాల్‌ పట్టణంలోని తర్నాహ్‌ డ్రెయిన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ పడవ కనిపించింది. దీంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నరోత్‌ జైమల్‌సింగ్‌, బమియాల్‌ పోలీసులతో పాటు నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రస్తుతం పఠాన్‌కోట్ పోలీసులు బోటులో సోదాలు జరిపి, స్వాధీనం చేసుకున్నారు. 

పడవపై ఎలాంటి గుర్తులు, రాతలు లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముందు జాగ్రత్తగా పఠాన్‌కోట్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం నది ప్రవాహంలో వచ్చిన పడవ తర్నాహ్‌ డ్రెయిన్‌ గుండా పాక్‌ పడవ భారత్‌ వైపు చేరుకుందని బమియాల్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఇన్‌చార్జి తార్సేమ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బోట్‌ను సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

గూఢచర్యం ఆరోపణలపై పఠాన్‌కోట్‌లో స్టేట్ ఆపరేషన్ సెల్ ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసింది. నిందితుడికి పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన మహిళా అధికారితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. నిందితుడు పఠాన్‌కోట్‌లోని మిలటరీ కంటోన్మెంట్‌ సమీపంలోని క్రషర్‌లో పని చేసేవాడు. 

మహిళా అధికారి నిందితులను హనీ ట్రాప్‌లో ఇరికించడంతో పాటు డబ్బు ఆశ చూపి దేశంలోని ముఖ్యమైన సమాచారాన్ని పాక్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించారు. మరో కేసులో కృనాల్ కుమార్ భరియాను అక్టోబర్ 23న స్టేట్ ఆపరేషన్ సెల్ అరెస్టు చేసింది.