కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై సోనియా ఆందోళన 

ఒక వంక వరుస పరాజయాలతో పార్టీ నిలదొక్కుకోవడం కష్టం అవుతున్న సమయంలో వరుసగా ఒకొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య విజృంభిస్తున్న కుమ్ములాటలు పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలోని ఐఏసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, రాష్ట్ర శాఖల అధ్యక్షులతో సోనియాగాంధీ సమావేశమయ్యారు. విధాన‌ప‌ర‌మైన అంశాల‌పై రాష్ట్ర‌స్ధాయి నేత‌ల్లో కూడా స్ప‌ష్ట‌త కొర‌వ‌డిన‌ట్టు తాను గుర్తించాన‌ని ఆమె విచారం వ్యక్తం చేశారు. దీనిపై వారి అభిప్రాయాలు స్పష్టంగా లేవని గ్రహించినట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పార్టీ కార్యకర్తలు అసత్యాలు, ప్రచారాలను గుర్తించి వ్యతిరేకించాలని ఆమె  సూచించారు. విధానపరమైన విషయాలపై స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. కానీ, ఒక్కొక్కరు ఒక్కో ఎజెండా పెట్టుకుని మాట్లాడితే మంచిది కాదు. అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాంటి పనులు చేయకండి’ అని ఆమె హెచ్చరించారు.
దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, కీల‌కాంశాల‌పై ఏఐసీసీ ప్ర‌తిరోజూ స‌వివ‌ర ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తున్నా అవి బ్లాక్‌, జిల్లా స్ధాయిలో పార్టీ శ్రేణుల వ‌ర‌కూ చేర‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ్యక్తిగత ఆశయాలు పార్టీ పటిష్టతపై ప్రభావం చూపకూడదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని నేతలకు సోనియాగాంధీ స్పష్టం చేశారు.
 
పార్టీ ప‌లు రాష్ట్రాల్లో అంత‌ర్గ‌త పోరు, తిరుగుబాటుల‌ను ఎదుర్కొంటున్న నేప‌ధ్యంలో పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఐక్య‌త గురించి ప్రస్తావిస్తూ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో మ‌నం స‌మైక్యంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా నవంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు.