తెలంగాణ సరిహద్దు ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మావోల మృతి

తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం ఉద‌యం భీక‌ర‌మైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసు బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో చోటు చేసుకుంది.
 
చనిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్ట్ నాయకుడు బద్రు అలియాస్ కల్లు, మహారాష్ట్ర గడ్చిరోలి డివిజన్ మావోయిస్టు నాయకుడు కమ్మగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాల్పులు జరిగిన సమయంలో మరో ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. అయితే దొరికిన ఎస్‌ఎల్‌ఆర్‌ వేపన్ కీలక నేతలు మాత్రమే వాడే అవకాశం ఉండటంతో పోలీసుల అనుమానిస్తున్నారు. .

చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా తెలంగాణ సరిహద్దులోకి ఎంట్రీ అయ్యాడని వార్తల నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. చర్ల, వాజేడు, వెంకటాపురం అటవీ ప్రాంతంలో కుంబింగ్ కొనసాగుతోంది. 

తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ ద‌ళాలు క‌లిసి కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బీజాపూర్‌, ములుగు సరిహ‌ద్దులోని త‌ర్ల‌గూడ వ‌ద్ద మావోయిస్టులు పోలీసుల‌కు తార‌స‌ప‌డ్డారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.