ట్విటర్‌ ఇండియా మాజీ హెడ్‌ కు సుప్రీంకోర్టు నోటీసు

ట్విటర్‌ ఇండియా మాజీ హెడ్‌ మనీష్‌ మహేశ్వరీకి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఘజియాబాద్‌ హింసాకాండ కేసుకు సంబంధించిన వివాదాస్పద వీడియోను పోస్ట్‌ చేయడంతో ఆయనను విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించాలంటూ యుపి పోలీసులు సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి. రమణ విచారణ చేపట్టారు.

ఘజియాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాల్సిందిగా మనీష్‌కి యుపి పోలీసులు పంపిన నోటీసును కర్ణాటక హైకోర్టు పక్కన పెట్టినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి అబ్దుల్‌ సమద్‌ సైఫ్‌పై కొందరు మూకలు జైశ్రీరామ్‌, వందేమాతరం అనాలంటూ దాడి చేసిన సంగతి తెలిసిందే. 

మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఈ దాడికి సంబంధించిన  వీడియోను మహేశ్వర్‌ పోస్ట్‌ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. దీంతో అతనిపై అల్లర్లను ప్రోత్సహించడం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలను మోపారు.

తనకు అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించాలంటూ మనీష్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని, పోలీసులకు సహకరిస్తానని చెప్పానని, కానీ ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాల్సిందేనని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. 

అరెస్ట్‌ చేయమని పోలీసులు హమీ ఇస్తే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని మహేశ్వర్‌ పేర్కొన్నారు. దీంతో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. యుపి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఆగస్టులో మహేష్‌ను ట్విటర్‌ సంస్థ అమెరికాకు బదిలీ చేసింది.