అక్రమ చర్చి వ్యవహారం: ఫిర్యాదులు పట్టించుకోవట్లేదంటూ జాతీయ ఎస్సీ కమిషనుకు గ్రామస్థులు లేఖ 

అక్రమ చర్చి నిర్వహిస్తున్న వ్యక్తిపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్న అధికారులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవడంపై గ్రామస్తులందరూ ఏకమయ్యారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం గ్రామంలో గత కొంతకాలంగా తిరణం స్వాతి కుమార్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా క్రైస్తవం స్వీకరించి, తన ఇంటినే చర్చిగా మార్చి, క్రైస్తవ ప్రార్ధనా కూటములు నిర్వహిస్తున్నాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ క్రైస్తవం స్వీకరించి ఇంకా ఎస్సీ హోదా అనుభవిస్తూ, తన ఇంట్లో నిత్యం క్రైస్తవ ప్రార్ధనలు చేస్తూ, మైకుల ద్వారా చుట్టుప్రక్కల వారికి ఇబ్బంది కలుగజేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన గ్రామస్థులు అధికారులకు, జిల్లా కలెక్టరుకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామస్థులు చేసిన ఫిర్యాదుకు అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఫిర్యాదు చేసిన గ్రామస్థులు అందరూ ఎస్సీ మాల సామజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లనే అధికారులు స్పందించట్లేదని ఆరోపిస్తూ, గ్రామస్థులు ఏకంగా జాతీయ ఎస్సీ కమిషనుకు పిటిషన్ సమర్పించారు.
తమ గ్రామంలో అక్రమంగా చర్చి నిర్వహిస్తున్నారని, దానికి ఎలాంటి అనుమతులు లేవని, ఆ చర్చి నుండి వస్తున్న శబ్ద కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని, దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి క్రైస్తవంలోకి మారి కూడా ఎస్సీ హోదా అనుభవిస్తున్నాడని గ్రామస్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తహసీల్దార్, స్థానిక పోలీసులు మొదలుకుని జిల్లా కలెక్టర్ వరకు ఈ అంశంపై ఇప్పటిదాకా అనేక ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని, అసలు ఈ అధికారులు మమ్మల్ని దేశ పౌరులుగా గుర్తించట్లేదనే భావన మాకు కలుగుతోందని ఫిర్యాదులో గ్రామస్థులు పేర్కొన్నారు. చట్టప్రకారం గ్రామస్తులంతా కలిసి ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం ద్వారా ఒక మతానికి చెందిన వ్యక్తికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం అంటే తమను అవమానించడమే అని గ్రామస్థులు ఆరోపించారు. ఈ అంశంపై తక్షణమే జిల్లా కలెక్టరుతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలకు సిఫార్సు చేయాల్సిందిగా జాతీయ ఎస్సీ కమిషనును గ్రామస్థులు కోరారు.
అందరూ ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్న, అధికారికంగా క్రైస్తవులు లేని గ్రామంలో చర్చి నిర్వహణ అంటే ముమ్మాటికీ అది మమ్మల్ని మతమార్పిడులకు లక్ష్యంగా చేసుకోవడమే అని గ్రామస్థులు పేర్కొన్నారు. దీనిపై గ్రామస్తులంతా కలసి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా కలెక్టరు కూడా స్పందించకపోవడం చూస్తుంటే ఈ కుట్రలో వారు కూడా పరోక్షంగా భాగస్వామ్యంగా ఉండటమే అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.