న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు.. ఆరుగురు అరెస్టు

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సిబిఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సిబిఐ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. 
 
మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సిఐడి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు.
 
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సిబిఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సిబిఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.