కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు 

కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రానిపక్షంలో అధికార మార్పిడి అనంతరం జనసేన పార్టీయే పేరు మారుస్తుందని ఆయన ప్రకటించారు. 
 
అణగారిన తరగతులకు అండగా నిలబడ్డ సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆయన కోరారు. సంజీవయ్య రెండేళ్లు పదవిలో ఉన్నా ఆ కాలంలోనే పలు కీలక సాగునీటి పధకాలను ప్రారంభించింది కూడా ఆయనే.   శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదినొ, వరదరాజులు ప్రాజెక్టు, కృష్ణాజిల్లాలో పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించి తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. 
 
సంజీవయ్య శతజయంతి సంవత్సరం ప్రస్తుతం కావడంతో, ఆయన సేవలను ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వారందరికీ భిన్నంగా రాజకీయాలు చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 
 
దేశంలో నేడు విశేష ప్రాచుర్యం పొందిన వితంతు పెన్షన్ పధకాన్ని మొట్టమొదటగా ప్రవేశ పెట్టింది కూడా సంజీవయ్య కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాల నిజాం భూములను పేదలకు పంచింది కూడా ఆయనే. కాపు, బోయ తదితర కులాలను బిసి జాబితాలో ఛేర్హించి కూడా ఆయనే. 
 
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను ఒకే పురపాలక సంఘంగా ఏర్పాటు చేసింది ఆయనే. చర్మకారుల ఉన్నతికోసం లిడ్ కాప్ ను ఏర్పాటు చేశారు. ఆయన మృతిచెందిన సమయంలో న్యూయార్క్ టైమ్స్ ప్రముఖ పేదల పక్షపాతి మృతిచెందాడని సంతాప వార్త ప్రచురించింది. 
 
ఆయన చనిపోయిన సమయంలో ఒక ఫియట్ కారు మినహా ఎటువంటి ఆస్తులను మిగుల్చుకొని వ్యక్తి. అతి పిన్న వయస్సులో 51వ వయస్సులోనే చనిపోయారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. లలబహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాలలో కూడా పనిచేశారు. 
 
కాగా, దామోదరం సంజీవయ్య నివాసమున్న ఇంటిని ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా స్మారక మందిరంగా మార్చాలని నిర్ణయించినట్లు గత వారం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకోసం కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు భాషాభివృద్ధికి కూడా విశేషంగా కృషి చేసిన సంజీవయ్య దేశంలోనే తొలి దళిత్ ముఖ్యమంత్రి కావడంతో పార్టీ కాంగ్రెస్ కు అధ్యక్షుడైన తొలి దళితుడు కూడా. కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు.