ప్రభుత్వ అప్పుల పత్రాలలో గవర్నర్ పేరా… హైకోర్టు 

దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చివరకు అప్పులు తీసుకొనే పత్రాలపై గవర్నర్  విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు కూడా చేర్చడం పట్ల రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గవర్నర్ ను హమీదారునిగా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు  ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. 

దీని ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు… బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని తప్పుపట్టింది.

రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని  తొలగించడం సరికాదని పేర్కొంది. అలాగే  ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీ ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది.

నిధుల బదిలీకి సంబంధించి ఒరిజనల్‌ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం  ఆదేశించింది. ఏపీఎ్‌సడీసీ ఏర్పాటు, అప్పులు తీసుకునే విధానంపై, ఇతర నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీకి తనఖా పెట్టారు. ఒప్పందంలో గవర్నర్‌ పేరును చేర్చడంపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జూలై 30వ తేదీన రాష్ట్రానికి రాసిన లేఖలో… రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు.

ఎస్‌డీసీ ద్వారా రూ.25,000 కోట్ల భారీ మొత్తాన్ని అప్పుగా తేవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమే లేఖ రాసినందున కేంద్రం, అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్‌ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్‌  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది.