చైనాలో ఒక్కసారిగా మరోసారి కరోనా కలవరం

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి పుట్టినిల్లు చైనాలో వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. పలు నగరాలు, పట్టణాల్లో స్థానికంగా వ్యాపిస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఉలిక్కిపడుతోన్న చైనా తాజాగా పలు నగరాల్లో వైరస్‌ విజృంభణ మొదలు కావడంతో అప్రమత్తమైంది. 

వందల కొద్దీ విమానాల రద్దు, పాఠశాలల మూసివేత, పెద్దఎత్తున సామూహిక పరీక్షలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు..! వృద్ధ దంపతులు సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్‌ రావడమే దీనంతటికీ కారణం. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలో పర్యటించారు. 

ఈ క్రమంలో రాజధాని బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

వాయువ్య చైనాలోని 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలకు ఆదేశాలిచ్చారు. గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసుల ను రద్దు చేశారు. ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో కరోనా ప్రభావం బొగ్గు దిగుమతులపై పడనుంది.

గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బుధవారం కొవిడ్‌తో 223 మంది చనిపోయారు. దాదాపు 44 వేల కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 40 వేల మందిపైగా వైర్‌సకు గురవుతున్న నేపథ్యంలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రానున్నది శీతాకాలమని.. ప్లాన్‌ బి ప్లస్‌ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏమాత్రం ఆలస్యంం చేయకుండా మాస్క్‌ తప్పనిసరి, ఇంటి నుంచి పని వంటి నిబంధనలను విధించాలని కోరారు. కేవలం కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారినే మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు అనుమతిస్తున్నారు. ఇన్నర్‌ మంగోలియాలోని పలు ప్రాంతాల్లోనూ నగరం నుంచి రాకపోకలను నిషేధించారు.  

ఇదిలాఉంటే కరోనా వైరస్‌ పోరులో భాగంగా చాలా దేశాలు వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను రచిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం పాజిటివ్‌ కేసులను సున్నాకు తీసుకురావడంతోనే మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని అనుసరిస్తోంది. 

దీంతో ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంత సరిహద్దులను మూసివేసి లక్షల సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీని శరవేగంగా కొనసాగుతున్న చైనా.. ఇప్పటివరకు 200కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.

ఇలా ఉండగా, కరోనా ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దానికి కారణం బ్రిటన్, అమెరికాలో రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని దేశాలలో కరోనా విజృంభణ తగ్గినా మరి కొన్ని దేశాలలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. యుకెలో రోజు 50 వేల కేసులు నమోదు అవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు నమోవుతున్నాయి. 

డెల్టా ఉత్పరివర్తనాలే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. క్యాలిఫోర్నియాలో ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కాలిఫోర్నియాలో మొదట గుర్తించిన కారణంగా దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తున్నారు. 

ఈ వేరియంట్ వల్లనే అమెరికా, బ్రిటన్‌లలో విపరీతంగా వ్యాప్తి చెంది రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు సంఖ్య కూడా అధికంగానే ఉంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్లను మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో కూడా గుర్తించారు. పాకిస్తాన్‌లో ఈ వేరియంట్ వల్లనే కేసులు అధికంగా పెరుగుతున్నాయని పాక్ ఆరోగ్య శాఖ పేర్కొంది.