కశ్మీర్‌లో పెట్టుబడులకు దుబాయ్‌ సిద్ధం

కశ్మీర్‌కు మొట్టమొదటి విదేశీ పెట్టుబడులు రానున్నాయి. కశ్మీర్‌ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్‌ సిద్ధంగా ఉన్నది. కశ్మీర్‌ లోయలో ఐటీ టవర్‌తోపాటు లాజిస్టిక్‌ పార్క్‌, మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 

ఈ మేరకు కశ్మీర్‌ అధికారులతో దుబాయ్‌ ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నది. ఈ చర్య పాకిస్తాన్‌కు దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని పాకిస్తాన్‌ మాజీ రాయబారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాల్లో భాగంగా, కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్‌ నిర్ణయించుకున్నది.

మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి జమ్ముకశ్మీర్ అధికారులు- దుబాయ్ మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం, ఐటీ టవర్‌, ఇండస్ట్రియల్ పార్క్‌, లాజిస్టిక్స్ టవర్‌తో పాటు మెడికల్ కాలేజీ, దవాఖానను దుబాయ్‌ నిర్మించనున్నది.

అయితే, ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కశ్మీర్ అభివృద్ధికి ప్రపంచం తమతోపాటు వస్తుండటం శుభసూచకమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నదని ఈ ఒప్పందం చూపిస్తుందని పేర్కొన్నారు.

కాగా, కశ్మీర్ సమస్యపై ముస్లిం దేశాల మద్దతును ఇంతవరకు పాకిస్తాన్‌ పొందలేదు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) కశ్మీర్ సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దుబాయ్ తీసుకున్న ఒక నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ తగులుతున్నది. 

 
జమ్ముకశ్మీర్ అధికారులు-దుబాయ్‌ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ..పాకిస్తాన్‌కు దౌత్యపరమైన ఓటమిగా పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం భారతదేశానికి పెద్ద విజయం. ఇప్పటికే ఓఐసీ కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు’ అని చెప్పారు.