అవినీతితో సామాన్యుల హ‌క్కుల‌కు విఘాతం

అవినీతితో సామాన్యుల హ‌క్కుల‌కు విఘాతం క‌లుగుతోంద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అవినీతి దేశ పురోగ‌తికి అడ్డంకిగా మారి మ‌న శ‌క్తియుక్తుల‌ను నీరుగార్చుతోంద‌ని విచారం వ్యక్తం చేశారు. 

గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంయుక్త సమావేశంలో మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొన్నారు. అవినీతిపై పోరాడాలనే దృఢ నిశ్చయం గత ప్రభుత్వానికి లేకపోవడంతో అవినీతిని క‌ట్ట‌డి చేయ‌డంలో  విఫ‌లమైంద‌ని విమర్శించారు. 

త‌మ ప్ర‌భుత్వం అవినీతిని దీటుగా ఎదుర్కొని ద‌ళారుల ప్ర‌మేయం లేకుండా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు అందుతాయ‌నే విశ్వాసాన్ని ప్ర‌జ‌ల్లో నెల‌కొల్పింద‌ని చెప్పారు. అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమని ప్రజలకు తన ప్రభుత్వం నమ్మకం కలిగించిందని ప్రధాన మంత్రి చెప్పారు.

గడచిన ఆరు-ఏడు సంవత్సరాల నుంచి తన ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోస‌గించిన వ్య‌క్తుల‌ను ఎక్క‌డ ఉన్నా విడిచిపెట్టేది లేద‌ని ఆర్ధిక నేర‌గాళ్లు నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వారిని ఉద్దేశించి స్ప‌ష్టం చేశారు.

‘‘దేశంలో అవినీతిని ఆపడం సాధ్యమేనని మేము గడచిన ఆరేడు సంవత్సరాల్లో ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచగలిగాం. మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమనే నమ్మకం దేశ ప్రజలకు నేడు కలిగింది. అవినీతి తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, సామాన్యుల హక్కులను పోగొడుతుంది. దేశ ప్రగతికి ఇది ఆటంకం, మన సమష్టి శక్తిపై ప్రభావం చూపుతుంది’’ అని మోదీ చెప్పారు.

జాతి ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే వారు ఎంత‌టివారైనా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తేల్చి చెప్పారు. దేశానికి, ప్రజలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారికి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత స్థానం ఉండదని హెచ్చరించారు.