నీర‌వ్‌మోదీకి న్యూయార్క్ కోర్ట్ లో చుక్కెదురు

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్‌లో ప‌రారీలో ఉన్న నిందితుడు, వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్‌మోదీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నీర‌వ్‌మోదీ, ఆయ‌న ఇద్ద‌రు స‌హ‌చ‌రులు త‌మ‌పై మోపిన ఫొర్జ‌రీ అభియోగాల‌ను కొట్టివేయాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను అమెరికా.. న్యూయార్క్ దివాళా న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. 

మోదీ యాజ‌మాన్యంలోని ఫైర్‌స్టార్ డైమండ్‌, ఫాంట‌సీ ఇంక్‌, ఏ జెఫ్ అనే సంస్థ‌లు మోస‌గించాయ‌ని వాటి (కోర్టు నియమించిన‌) ట్ర‌స్టీ రిచ‌ర్డ్ లెవిన్ ఆరోపించారు. త‌మకు జ‌రిగిన న‌ష్టాల‌కు నీర‌వ్‌మోదీ, ఆయ‌న స‌హ‌చ‌రులు మిహిర్ భ‌న్సాలీ, అజ‌య్ గాంధీ నుంచి క‌నీసం 15 మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రిహారం ఇప్పించాల‌ని లెవిన్ కోరారు.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌తోపాటు ఇత‌ర బ్యాంకుల నుంచి 100 కోట్ల డాల‌ర్లు స్వాహా చేసేందుకు నీరవ్ మోదీ కుట్ర చేశార‌ని భార‌త్‌-అమెరికా న్యాయ‌వాది ర‌వి భాత్రా ఆరోపించారు. త‌న లాభాల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌డంతో మోదీ త‌న కంపెనీ షేర్ల విలువ పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని పేర్కొన్నారు. 

త‌దుప‌రి త‌న కంపెనీల ఖాతాల నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌రించి.. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌కు వాడుకున్నాడని ఆరోపించారు. సాధార‌ణ లావాదేవీల మాదిరిగా వాటిని రికార్డుల్లో చూపార‌ని చెప్పారు. విదేశాల నుంచి ఆభ‌ర‌ణాల దిగుమ‌తి కోసం ఫేక్ లెట‌ర్ ఆఫ్ ఇండెంట్ల పేరిట పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, ఇత‌ర బ్యాంకుల‌ నుంచి రుణాలు, నిధులు పొందేందుకు కుట్ర చేశార‌ని ర‌విభాత్ర ఆరోపించారు.

నీర‌వ్ మోదీ.. అత‌డి ఇద్ద‌రు స‌హ‌చ‌రులు హాంకాంగ్, దుబాయ్‌ల్లో గుల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఫేక్ దిగుమ‌తి ట్రాన్సాక్ష‌న్స్ రికార్డు చేశార‌న్నారు. మ‌నీ లాండ‌రింగ్ పాల్ప‌డ్డార‌ని చెప్పారు. విచార‌ణపై జ‌డ్జి స్పందిస్తూ.. నీర‌వ్‌మోదీ మోసం వ‌ల్ల పీఎన్బీ.. 100 కోట్ల డాల‌ర్ల‌కు పైగా న‌ష్ట‌పోయింద‌ని వ్యాఖ్యానించారు.