పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు అతిపెద్ద స‌వాల్

పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు త‌మ‌కు అతిపెద్ద స‌వాల్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఆమె న్యూయార్క్‌లో ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల అతిపెద్ద స‌వాల్‌గా అవ‌త‌రిస్తోంద‌ని తెలిపారు. 

కరోనాతో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డానికి త‌మ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న కొన్ని ప‌థ‌కాల‌పై ముడి చ‌మురు ధ‌ర‌ల ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంద‌ని ఆమె సంకేతాలిచ్చారు. త‌మ దృష్టి మొత్తం పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల‌పైనే ఉంద‌ని.. ఎంత గ‌రిష్ఠంగా పెరుగుతాయి.. త‌త్ఫ‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న విష‌య‌మై కేంద్రీక‌రించామ‌ని ఆమె పేర్కొన్నారు.

క‌రోనాతో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ పురోభివృద్ధికి చేప‌ట్టిన ఉద్దీప‌న‌ల ప్యాకేజీలు కొంత కాలం కొన‌సాగుతాయ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. ఉద్దీప‌న‌ల‌తో సుస్థిర అభివృద్ధి సాధించ‌డ‌మే ల‌క్ష్యం అని ఆమె త్లెఇపారు. 

ప్ర‌స్తుత ఆర్థిక సంవత్స‌రంలో జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుంద‌ని ఆర్బీఐ, అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచ‌నా వేశాయి. కానీ ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌, బొగ్గు నిల్వ‌ల కొర‌త ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయేమోన‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇలా ఉండగా,  రెట్రోస్పెక్టివ్ టాక్స్ చ‌ట్టం ఉప‌సంహ‌రించ‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆర్థిక‌ సంస్క‌ర‌ణ‌ల‌ను జో బిడెన్ సార‌ధ్యంలోని అమెరికా స‌ర్కార్‌, అమెరికా కంపెనీలు స్వాగ‌తిస్తున్నాయ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ  చెప్పారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో భార‌త ప్ర‌భుత్వం చాలా సానుకూల నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని బిడెన్ స‌ర్కార్ పేర్కొన్న‌ద‌ని ఆమె తెలిపారు. 

రెట్రోస్పెక్టివ్ టాక్స్ చ‌ట్టం ఉప‌సంహ‌ర‌ణ చాలా సాహ‌సోపేత‌మై నిర్ణ‌యం అని అమెరికా కార్పొరేట్లు కొనియాడార‌ని ఆమె చెప్పారు. కార్పోరేట్ సంస్థ‌లు 50 ఏండ్ల క్రితం పొందిన క్యాపిట‌ల్ గెయిన్స్ టాక్స్ విధిస్తూ ఇంత‌కుముందు కేంద్రం చేసిన చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ గ‌త ఆగ‌స్టులో కేంద్ర ప్ర‌భుత్వం బిల్లును ఆమోదించింది.

విదేశీ కార్పొరేట్ సంస్థ‌ల నుంచి రెట్రోస్పెక్టివ్ టాక్స్ వ‌సూలు చేసినందుకు.. ఆయా సంస్థ‌లు.. ఇత‌ర‌దేశాల్లోని భార‌త్ ఆస్తులు న్యాయ‌వివాదంలో చిక్కుకోవ‌డంతో కేంద్రం స‌ద‌రు చ‌ట్టాన్ని ఉపసంహరించుకొంది. త‌ద‌నుగుణంగా వ‌సూలు చేసిన టాక్స్ మొత్తం రీఫండ్ చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.