టిడిపి బంద్ పిలుపు … నేతల ముందస్తు అరెస్టులు

రాష్ట్ర  వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు టిడిపి కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిపి, విధ్వంసం సృష్టించినందుకు నిరసనగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు నేడు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. బంద్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను  మోహరింపచేశారు. టిడిపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. పలు చోట్ల టిడిపి కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్విదాలు జరుగుతున్నాయి.

టిడిపి అధికార ప్రతినిధి కె పట్టాభిరామ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో  విమర్శించారంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించారు. 

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం… కర్రలు, ఇనుపరాడ్లతో కార్యాలయంలోకి ప్రవేశించిన వైసిపి కార్యకర్తలు భయానక వాతావరణం సృష్టించారు. గేటు వద్దే అడ్డుకోబోయిన టిడిపి కార్యకర్తను జాతీయ రహదారిపైకి తీసుకొచ్చి రోడ్డుపైకి నెట్టడంతో అదే సమయంలో అటుగా వెళుతున్న లారీ తగిలి గాయపడ్డారు. 

బద్రీ అనే కార్యకర్త తలపై కొట్టడంతో అపస్మాకరకస్థితిలోకి వెళ్లిపోయారు. మరో ఇద్దరు కార్యకర్తల చేతులు విరగ్గొట్టారు. కార్లను ధ్వంసం చేశారు. విజయవాడలోని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఇంట్లో చొరబడి వస్తువులన్నీ పగులకొట్టి విధ్వంసం సృష్టించారు.

అయితే డీజీపీ కార్యాలయంపై కూతవేటు దూరంలోని తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై విధ్వంసం జరపడం, తాను ఫోన్ చేసినా డిజిపి స్పందించక పోవడంతో  ముఖ్యమంత్రికి… డీజీపీకి తెలిసే ఈ దాడి జరిగింది టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.   ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని చంపాలని చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ దారుణం చాలదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాయోజిత టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోందని, రౌడీలకు ప్రభుత్వమే పోలీసులతో రక్షణ కల్పించి దాడులకు పంపించే దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. గంజాయి సాగు… రవాణా… మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరిగిపోతే దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతిపక్ష పార్టీగా తమకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. 

రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతం ని పొగాకు బోర్డు చైర్మన్, బిజెపి సీనియర్ నేత యడ్లపాటి రఘునాధబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టలేని ప్రతిపక్షం, రాజకీయ మనుగడ కోసం, ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశ్యంతో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, విమర్శలను తట్టుకునే మనస్థైర్యం లేని అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయి, అణచివేతకు, భౌతికదాడులకు పాల్పడడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇరువురూ రాజకీయలబ్ది కోసం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలను ప్రజలు కూడా హర్షించరని స్పష్టం చేశారు. .
మరోవంక,టీడీపీ నాయకుల బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని సజ్జల డిమాండ్‌ చేశారు. 
టిడిపి పార్టీ కార్యాలయాలపై దాడులను, వైసిపి అరాచకాలను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఖండించారు. వైసిపి అరాచకాలు ఎవరికీ క్షేమం కాదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం ఇదే ప్రథమమని, ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు చెప్పారు. 
 
ఎపిలో జరుగుతున్న ఘటనలపై జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎపి పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. దోషుల్ని శిక్షించకుంటే ఏపి అరాచకానికి మారుపేరుగా మారుతుందని హెచ్చరించారు.. భవిష్యత్‌లో ఇటువంటి పోకడలు తగ్గించుకోకుంటే ప్రజాస్వామ్యానికి గొడ్టలిపెట్టు అవుతుందని పేర్కొన్నారు.