ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులు, విధ్వంసం

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. మంగళగిరి సమీపంలో గల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపి, విధ్వంసం సృష్టించారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వెళ్లి, అక్కడ కనపడినవారిపై దాడి జరిపి, అద్దాలు, సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. 
 
విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. విజయవాడలో టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిపారు. పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు.  దాడి సమయంలో ఇంట్లో కేవలం పట్టాభి ఐదేళ్ల కూతురు, పనిమనిషి, డ్రైవర్ ఉన్నారు. దాడి జరుగుతుండగా పట్టాభి కూతురిని బాత్‌రూమ్‌లో దాచిన పని మనిషి డ్రైవర్ మెడపై కత్తి పెట్టి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. 
 
హిందూపూర్ లో ఎమ్యెల్యే ఎన్ బాలకృష్ణ క్యాంపు కార్యాలయంపై దాడి జరిపారు. ప్రొద్దటూరులో టిడిపి నేత లింగారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. రేణిగుంటలో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు. ఆయన రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లకు ఫోన్ చేసి, దాడుల గురించి తెలిపారు. 
 
టిడిపి కేంద్ర కార్యాలయంపై కేంద్ర భద్రతా దళాల రక్షణ కావాలని కోరారు. పార్టీ నుండి అధికారికంగా లేఖ వ్రాస్తే పరిశీలిస్తామని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడతానని కూడా చెప్పారు. డిజిపి కార్యలయంకు కూతవేటు దూరంలో టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినా పోలీసులు ఎవ్వరు రాలేదు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినా స్పందన లేదు. 
 
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, డిజిపిల కన్నుసన్నలోనే ఈ దాడులు జరిగాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు ఆరోపించారు. దాడులతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఈ దాడులు పిరికిపందల చర్యగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. 
 
మాదక ద్రవ్యాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నర్సీపట్నం పోలీసులు అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశంలో అధికార పక్షంపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన కొద్దిసేపటికి ఈ దాడులు జరిగాయి. 
 
చెన్నై, తెలంగాణ పోలీసులు కూడా అక్కడకు వెళ్లారని, ఏపీ నుండి గంజాయి దొంగ రవాణా జరుగుతున్నట్లు యుపి, కర్ణాటక పోలీసులు కూడా మాట్లాడారని వారికి నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అంటూ అయన ప్రశ్నించారు. పైగా, వైసిపి నేతలు కనుసన్నలలోనే గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నదని ఆరోపిస్తూ  పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.నర్సీపట్నం నుంచి గుంటూరు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.
 
 టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై తక్షణమే డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని సూచించారు.