
అమాయక పౌరులు, మైనారిటీలు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఇటీవల వరుస హత్యలకు పాల్పడుతున్న జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటించనుండటం ఇదే మొదటిసారి.
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సైతం ఈ పర్యటనలో పాల్గోనున్నారు. గత కొద్దిరోజులుగా స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న ఘటనలు కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఇంతవరకూ 11 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపగా, వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
ఈ క్రమంలో ఉగ్రవాద ఏరివేత చర్యలను భద్రతా దళాలు తీవ్రం చేశాయి. డజనుకు పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అమిత్‌షా సైతం కశ్మీర్‌లో ఉగ్రఘాతుకాలతో సహా వివిధ భద్రతా అంశాలపై సోమవారంనాడు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల చీఫ్‌లతో చర్చించారు.
న్యూఢిల్లీలో ని ఐబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని, అధికారులతో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశంలో దేశంలోని భద్రతా పరిస్థితి, శాంతి భద్రతల సమస్యలు, కశ్మీర్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరుపుతున్న ఘాతుకాలను చర్చించారు.
ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
ఇలా ఉండగా, భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాజౌరీ సెక్టార్‌లోని దట్టమైన అడవులలో భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ లష్కరే ఇ – తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులను కాల్చివేసింది. మిగిలిన ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు అడవుల్లోనే చిక్కుకుపోయారు.
ఉగ్రవాదుల దాడిలో భారత సైన్యం తొమ్మిది మందిని కోల్పోయిన తరువాత ఉగ్రవాదుల్ని తుదముట్టించాలనే నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ అక్టోబర్ 16న ఈ ప్రాంతాన్ని సందర్శించి, స్థానిక కమాండర్లతో చర్చలు జరిపారు.
ఈ క్రమంలో ‘ఉగ్రవాదులు రెండు జట్టులుగా విడిపోయి.. వారి స్థానం నిరంతరం మార్చుకోవడం వల్ల సైనిక దళాలకు ప్రాణ నష్టం జరిగింది’ అని భారత ఆర్మీ కమాండర్ తెలిపారు. సౌత్ బ్లాక్ కధనం ప్రకారం గత రెండు మూడు నెలల్లోనే పాకిస్తాన్ నుండి రాజౌరి – పూంచ్ జిల్లా సరిహద్దుల మధ్య అడవులవైపు తొమ్మిది నుండి పది మంది వరకు ఉగ్రవాదులు చొరబడ్డారు.
వీరి చొరబాటుతో నియంత్రణరేఖపై కంచె వెంట బిడ్‌లు విఫలమయ్యాయి. ఇప్పటికే లష్కరే తో ఇయిబా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు ఆప్ఘనిస్తాన్‌లో విజయం సాధించారు. ఈ ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం, భద్రతా సంస్థలు ఊహించి వారిని ఎన్‌కౌంటర్ చేశాయి.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి