మత హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు

మతాన్ని ఉపయోగించుకుని హింసను ప్రేరేపించేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హోం మంత్రిని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆదేశించారు. యథార్థాలను తనిఖీ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరగడంతో ఈ ఆదేశాలిచ్చారు.

గత బుధవారం ఖురాన్‌కు అపచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ రావడంతో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దుర్గా పూజల మండపాలపై వందలాది మంది దాడులు చేశారు. గత ఆదివారం రాత్రి హిందువులకు చెందిన 66 ఇళ్ళను ధ్వంసం చేసి, సుమారు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు. 

కేబినెట్ సెక్రటరీ ఖండ్కేర్ అన్వరుల్ ఇస్లామ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి షేక్ హసీనా మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మతాన్ని ఉపయోగించుకుని హింసను ప్రేరేపించేవారికి వ్యతిరేకంగా తక్షణమే చర్యలను ప్రారంభించాలని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను ఆదేశించారని పేర్కొన్నారు. 

యథార్థాలను తనిఖీ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ప్రజలను హసీనా కోరారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హసీనా చెప్పారని చెప్పారు. 

బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, దుర్గా పూజల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఆరుగురు హిందువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

భారత్-బంగ్లా సత్సంబంధాలను దెబ్బతీసే కుట్ర

 కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు ఛాందసవాదులు కుట్ర పన్నారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై దాడులు భారీ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఈ దాడులపై బంగ్లాదేశ్ కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. 

భారత్, బంగ్లాదేశ్ సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయని చెబుతూ ఈ బాంధవ్యాన్ని దెబ్బతీసేందుకు ఛాందసవాదులు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ దేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతుండటం బాధాకరం, సిగ్గుచేటు అని పేర్కొన్నారు. హింసాకాండతో ప్రమేయం ఉన్నవారిలో కొందరిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసిందని చెప్పారు.

అరెస్టయినవారికి ఛాందసవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దుర్గా పూజల సందర్భంగా మత, సాంస్కృతిక సంస్థలపై దాడులు జరపడం ఛాందసవాదుల కుట్ర అని తెలిపారు. త్రిపుర ప్రజలు కూడా బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించాలని, హింసాకాండకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

త్రిపుర సరిహద్దులో బంగ్లాదేశ్ ఉంది. సుమారు 856 కిలోమీటర్ల మేరకు ఈ సరిహద్దు ఉంది. అక్టోబరు 15న బంగ్లాదేశ్‌లోని నౌఖాలీ జిల్లాలో దుర్గా పూజ మండపాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.