ఐఎస్‌ఐ చంపివేస్తుందని పారిపోయిన ఆఫ్ఘన్ మంత్రి

తాలిబన్‌ సీనియర్‌ నేత, విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి  షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టనిక్జాయ్  కాబూల్‌ నుంచి పారిపోయారు. దుబాయ్ లో తన కుటుంబం సభ్యులతో ఉంటున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

పాకిస్తానీ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) తనను హత్య చేస్తుందనే భయంతోనే ఆఫ్ఘనిస్తాన్‌ నుండి పారిపోయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తాను తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌ వస్తే, ఐఎస్‌ఐ తనను చంపుతుందనే భయంతో స్టనిక్జాయ్ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి పారిపోయారని ఆయా వర్గాలు ధ్రువీకరించాయి. 

ఆయనకు రష్యాతో, భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తాలిబన్‌ ప్రభుత్వంలోని హక్కానీ గ్రూప్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం భారత్‌ మొదటిసారిగా స్టనిక్జాయ్తోనే తోనే చర్చలు జరిపింది. 

అప్పట్లో ఆయన దోహాలోని తాలిబన్‌ రాజకీయ కార్యాలయం అధిపతిగా ఉండేవారు. భారత్‌తో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక  సంబంధాలను కొనసాగించాలని తాలిబన్లు కోరుకుంటున్నట్లు  స్టనిక్జాయ్  గతంలో చెప్పారు. 

అయితే ఆయనకు భారత దేశంతోగల అనుమానాస్పద సంబంధాల పట్ల తాలిబన్లలోని హక్కానీ గ్రూపు, పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఆందోళన చెందాయి.  ఇటీవల తాలిబన్‌ గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కాగా, తాలిబన్‌లు మారారని ప్రపంచానికి వెల్లడించిన అబ్బాస్‌ స్టనిక్జాయ్ , ముల్లా బరాదర్‌లు ఇద్దరూ కూడా దేశాన్ని విడిచి పారిపోయారని ఇరాన్‌ జర్నలిస్ట్‌ ఒకరు ట్వీట్‌ చేశారు.