టీడీపీ నేత పట్టాభి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  టీడీపీ అధికార ప్రతినిధి  కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను విజయవాడలోని ఆయన ఇంటివద్ద గత రాత్రి నాటకీయంగా  పోలీసులు అరెస్టు చేశారు.  తలుపులు పగులకొట్టి మరీ లోపలకు వెళ్లి భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేశారు. ఆయనను గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు ఆయనను తరలించారు.  
 
రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి పట్ల పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో పట్టాభి ఇంటి గేట్లు విరగొట్టి మరీ పోలీసులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిపై 120బీ, 505, 504 సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చందన  స్పష్టం చేశారు. సెక్షన్‌ 120 బి కింద పట్టాభిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్‌ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.
 
అరెస్ట్ కు కొద్దిసేపు ముందు తనను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముందని పేర్కొంటూ పట్టాభి వీడియో విడుదల చేశారు. వీడియోలో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
“నన్ను పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టడానికి సీఎం కుట్ర పన్నాడు. అందుకే నా శరీరం మొత్తాన్ని చూపిస్తున్నాం’’ అని ఆ వీడియోలో పట్టాభి పేర్కొన్నారు.  ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టుపై తనకు నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని పట్టాభి స్పష్టం చేశారు.