పండగలను సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదే

పండగలను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. పైడతల్లి ఉత్సవం సందర్భంగా  సోమవారం అమ్మవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, భార్య సునీల గజపతిరాజు, కుమార్తె అదితి గజపతి రాజు, కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. 

పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా వేళ అంతా జాగ్రత్తలను పాటించాలని సూచించారు. పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. 

ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని అది ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రోటోకాల్‌ను ఒక్కొక్కరి వద్ద ఒకలా అమలు చేస్తున్నారని ఆరోపించారు. పండగ సమయంలో ప్రోటోకాల్‌ ఉండబోదని స్పష్టం చేశారు. టిడిపి హయాంలో 300 రూపాయలు టిక్కెట్లు పెట్టారని ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

ఏ రాజకీయ పార్టీలయినా దేవస్థానాల టిక్కెట్లు రేట్లను ఎలా నిర్ణయిస్తాయని ప్రశ్నించారు. టిడిపి కి అమ్మవారి పండగ తో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ప్రశ్నిస్తుంటే తనను ఆలయాలు నుండి తొలగించారని చెబుతూ అయితే తాను కోర్టు ద్వారా న్యాయం చేసుకోగలిగానని గుర్తు చేశారు.

పండగలను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.  ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మమని తెలిపారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలని హితవు చెప్పారు.