ఓటుతో దెబ్బకొడితే.. కేసీఆర్ చెంప చెల్లుమనాలి

ఈ నెల 30న జరుగనున్న ఉపఎన్నికలో ప్రజలు దెబ్బకొడితే ప్రగతిభవన్ లో కేసీఆర్ చెంప చెల్లుమనాలని మాజీ మంత్రి, హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పిలుపిచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాజేందర్ కు ఓటేస్తామని చెప్పినవాళ్లకు తనది కారు గుర్తు అని చెబుతున్నారట అని హెచ్చరించారు. 
 
గతంలో వలే టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని, ఇప్పుడు బిజెపి అభ్యర్థిని అని గుర్తు చేస్తూ,  తనకు కమలం (పువ్వు) గుర్తుపై ఓట్ వేసి గెలిపించాలని కోరారు. తన ఎన్నికల గుర్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత తనదే అని పేర్కొంటూ, ఇప్పడు తాను ఏమీ అభివృద్ధి చేయలేదని నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పుచేసినట్లు నిందలు వేసి బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు.
సమైక్య రాష్ట్రంలో తనపై ఎన్ని నిర్బంధాలు మోపినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసానని రాజేందర్ గుర్తు చేశారు. తనను మోసం చేసి బయటకు పంపించడమే కాకుండా.. దమ్ముంటే గెలవమంటే సవాల్ స్వీకరించి వచ్చానని చెప్పారు. నీవేందో, నేనేందో తేల్చుకునే రోజు ఈనెల 30 అని పేర్కొన్నారు.
ఏ కులానికి ఆ కులపోళ్లు ఓట్లు వేసుకుంటే నడుస్తదా? ఇవి పేర్కొంటూ కులాలకు, మతాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలని అని తెలిపారు. ఎన్నడు రాని మంత్రులు డీసీఎం వ్యాన్లలో సారా సీసాలు పట్టుకువచ్చి పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు లొంగుతలేరని, దానితో తన మీద చివరి అస్త్రం.. పాశుపతాస్త్రం వేస్తాడట అని ఎద్దేవా చేశారు.
ఓటుకు రూ 20 వేల నుంచి 50 వేలు ఇస్తాడట..ఇప్పటికే రూ 300 కోట్లు ఖర్చు చేసాడని తెలిపారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రూ 30 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పారు. వెయ్యి కోట్లైనా ఖర్చు చేసి ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ చెబుతున్నాడట అని అంటూ తన వల్లన పైకి వచ్చిన నాయకులతోనే తనను పొడిపించి ఓడిస్తారట అని తెలిపారు.
తనతో ఉన్నట్లుండి నెల రోజులకే ఫ్లేట్ ఫిరాయించారని చెబుతూ వారెందుకు ఫిరాయించారో మీకు తెలుసునని చెప్పారు. వాళ్లు నిజంగా మనుషులు, మమకారం ఉన్నోళ్లైతే.. వాళ్లు కూడా తన కోసమే పనిచేయాలని స్పష్టం చేశారు. కానీ దళితబంధు, ఫించన్లు పోతాయని బెదిరిస్తున్నారటని పేర్కొంటూ తనకు ఓటేస్తే ఇవన్నీ పోతాయా? అని ఈటెల ప్రజలను అడిగారు.