టీకాలలో దక్షిణాదిన అట్టడుగున తెలంగాణ 

తెలంగాణలో కరోనా మహమ్మారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నది. ఒక వంక టెస్ట్ లు సరిగ్గా చేయకుండా కరోనా కేసులను తక్కువగా ఉన్నట్లు చూపే ప్రయత్నం  చేస్తుండగా, మరో వంక టీకాలలో కూడా నత్తనడక నడుస్తున్నది. మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో కరోనా టీకాలు వేయడంలో తెలంగాణ వెనుకబడింది. 
 
దేశం మొత్తం మీద 100 కోట్ల డోస్ లకు చేరువలో ఉండగా, తెలంగాణాలో మాత్రం ఇప్పటిదాకా 2.84 కోట్ల డోసుల టీకాలు మాత్రమే వేశారు. ఎక్కువ మందికి టీకాలు వేసిన ముందున్న 10  రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేనే లేదు. శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన వెబ్​సైట్​లో వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరిచింది. 
 
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, యూటీలకు సంబంధించిన ఫస్ట్, సెకండ్ డోసుల డేటాను అప్‌‌‌‌డేట్ చేసింది. అందులో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కర్నాటక, తమిళనాడు, ఏపీ.. వరుసగా 7, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. కేరళ 11వ స్థానంలో ఉంది.
ఇప్పటిదాకా కర్నాటక రెండు డోసులు కలిపి 6.05 కోట్లు, తమిళనాడు 5.26 కోట్లు, ఏపీ 4.63 కోట్లు, కేరళ 3.70 కోట్ల డోసులు వేశాయి. హర్యానాలో 2.45 కోట్ల డోసులు, పంజాబ్​లో 2.10 కోట్లు, చత్తీస్​గఢ్​లో 1.99 కోట్ల డోసుల టీకాలను వేశారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో 2.99 కోట్ల మందికి మొదటి డోసు, 1.64 కోట్ల మందికి రెండో డోసు ఇచ్చారు.
అంటే ఏపీ వేసినన్ని మొదటి డోసు టీకాలు కూడా మొత్తంగా తెలంగాణలో వేయలేదు. ఇప్పటిదాకా తెలంగాణలో 2.10 కోట్ల మందికి మొదటి డోస్, 79.67 లక్షల మందికి రెండో డోస్ టీకాలు  వేసినట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. శనివారం ఉదయం 7 గంటల వరకు రెండు డోసులు కలిపి దేశం మొత్తం మీద 97.24 కోట్ల మందికి వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 69,30,14,131 మందికి మొదటి డోస్, 27,93,62,914 మందికి రెండో డోస్ ఇచ్చినట్లు తెలిపింది.
ఇప్పటి వరకు రెండు డోసులు కలిపి 11.78 కోట్ల డోసులు వేసిన ఉత్తరప్రదేశ్‌‌ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 9.07 కోట్ల డోసులతో రెండో స్థానంలో, గుజరాత్ 6.64 కోట్ల డోసులతో మూడో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్నాటక, రాజస్తాన్, తమిళనాడు, ఏపీ ఉన్నాయి.