కాశ్మీర్ లో 13 మంది ఉగ్రవాదులు, 9 మంది సైనికుల మృతి

జమ్మూ కాశ్మీర్ గత రెండు వారాలుగా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో కాల్పుల హోరుతో మారుమోగిపోతున్నది. పలు సంఘటనలలో 13 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేయగా, 9 మంది సైనికులు, 8 మంది హిందువులు, సిక్కులు ఉగ్రవాదుల దాడులలో చనిపోయారు. 
 
తాజాగా లష్కరే తొయిబా కమాండర్ హతం కాగా, మరో మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్‌, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. గత ఆరు నెలల్లో లోయలో ఇంత భారీగా తుపాకుల మోత ఎప్పుడు వినబడలేదు.
సరిహద్దు జిల్లా పూంచ్‌లో అడవుల్లో దాక్కున్న మిలిటెంట్లను తరిమికొట్టే ఆపరేషన్ ఇప్పటివరకు తొమ్మిది మంది ఆర్మీ సిబ్బందిని బలితీసుకుంది. రైఫిల్ మెన్ విక్రమ్ సింగ్ నే, యోగంబర్ సింగ్ మృతదేహాలను శుక్రవారం స్వాధీనం చేసుకోగా, సుబేదార్ అజయ్ సింగ్, నాయక్ హరేంద్ర సింగ్ మృతదేహాలను శనివారం సాయంత్రం మెంధర్ ప్రాంతంలోని నార్ ఖాస్ అడవులలో కనుగొన్నారు. .

బింబర్ గాలి-సూరంకోట్ రహదారి వెంట ఉన్న భటా దురియన్ గ్రామం సమీపంలోని అడవులలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులతో జరిగిన తీవ్రమైన కాల్పుల నుండి నలుగురు సిబ్బంది అదృశ్యమయ్యారు.

అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను తరిమికొట్టడానికి భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్స్‌లో తాము కూడా భాగమని  లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. “మిలిటెంట్లను తటస్తం చేయడానికి, సైనికులతో కమ్యూనికేషన్‌ను తిరిగి స్థాపించడానికి నిర్విరామ కార్యకలాపాలు కొనసాగాయి” అని ఆయన పేర్కొన్నారు.

సోమవారం పూంచ్‌లోని చామ్రేడ్ అడవులలో, రాజౌరి జిల్లాలోని పంగైలో అడవులలో భద్రతా బలగాలు ఎదుర్కొన్న బృందం నుండే  ఉగ్రవాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక జెసిఓ,  నలుగురు జవాన్లు మరణించారు.

పూంచ్ చివరిసారిగా 2004 లో సురంకోట్ ప్రాంతంలోని ఖోలేయన్‌వాలీ వద్ద పెట్రోలింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో నలుగురు సైనికులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. శనివారం, సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్‌లను ఉపయోగించి అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రయత్నించింది. ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుండి భారీగా ఆయుధాలు కలిగిన పెద్ద సమూహం ఉన్నట్లు తెలుస్తోంది. వారు సోమవారం నుండి మూడు కాల్పులలో ఆర్మీ సిబ్బందిని నిమగ్నం చేశారు. 

ఇలా ఉండగా,  పుల్వామా జిల్లాలోని పాంపోర్ ద్రంగ్ బల్ లో పోలీసులు,భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే తోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. పాంపోర్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆ పరేషన్ మొదలు పెట్టారు.

ఎన్ కౌంటర్ తర్వాత వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్ పోలీసులు విడుదల చేసిన టాప్10 ఉగ్రవాదుల జాబితాలో ఉమర్ ముస్తాక్ పేరు కూడా ఉంది. శ్రీనగర్ లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులో ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు.

కాగా, శ్రీనగర్‌ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్‌కు చెందిన చిరు వ్యాపారి అరవింద్‌ కుమార్‌ షాపై శనివారం సాయంత్రం 6.40 గంటలకు ఉగ్రవాదులు దగ్గరగా తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

మరోవైపు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కూలీ సాగిర్‌ అహ్మద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా అతడు చనిపోయాడు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో అదనపు భద్రతా దళాలను రప్పించి ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఇటీవల పౌరుల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కశ్మీర్‌ పండిట్లతోపాటు అక్కడి మైనార్టీలైన సిక్కు, స్థానికేతరులపై కాల్పులు జరిపి హత్య చేస్తున్నారు. గత వారం శ్రీనగర్‌లో ఒక స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఇద్దరు టీచర్లు, బీహార్‌కు చెందిన ఒక వీధి వ్యాపారితోపాటు ఫార్మసిస్ట్‌ అయిన కశ్మీర్‌ పండిత్‌, మరో వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

పౌరులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కేంద్రం  ప్రత్యేక ఉగ్రవాద నిరోధక బృందాలను శ్రీనగర్‌కు తరలించింది. మరోవైపు ప్రధాని మంత్రి ప్రత్యేక ఉపాధి పథకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొంది కశ్మీర్‌కు తిరిగి వచ్చిన పలు వలస కుటుంబాలు మరోసారి ప్రాణ భయంతో తమ ఇండ్లను ఖాళీ చేస్తున్నారు.