కేరళలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాలకు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి మృతి చెందగా.. కొట్టాయంలో కొండచరియలు విరిగిపడ్డ సంఘటనలో 12 మంది గల్లంతయ్యారు. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్‌ జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.  పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. 
 
తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ వయనాడ్ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో గాలింపు చర్యలు ముందుకు సాగడం లేదు. దీంతో సహాయక చర్యల కోసం వాయసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం అర్థించింది. 
 
కొండచరియలు కారణంగా ఎక్కువగా ప్రమాదాలు సంభివిస్తున్న కొట్టాయం జిల్లాలోని కూటికల్‌లో సహాయ చర్యల కోసం వైమానిక సాయాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
 
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వరద బాధితులకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో మి -17, సారంగ్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలో అన్ని వైమానిక స్థావరాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు.
 
దాదాపు 30 మంది సిబ్బందితో కూడిన ఆర్మీ కాలమ్ పాంగోడ్ మిలిటరీ స్టేషన్ నుంచి కంజీరపల్లిన్ కొట్టాయం జిల్లాకు తరలించారు. దక్షిణ నావల్ కమాండ్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. 
 
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం అలెర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పర్వతాలు, నదీ తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించించింది. వర్షాలకు కేరళ తీరంలో ఆగ్నేయ తీరంలో ఏర్పడిన అల్పపీడనమే కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా తూల మాసం పూజల కోసం శబరిమల ఆలయం ఆదివారం ఉదయం తెరచుకుంది.  భారీ వర్షాల కారణంగా అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి రాకుండా ఉండటమే మేలని ఆలయ అధికారులు సూచించారు.ఈ నెల 21 వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు.