హిందూ ఆలయాలపై దాడులు జరిపిన వారిని వదిలిపెట్టబోం

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, దుర్గాదేవి మండపాల్లో జరుగుతున్న వరుస దాడులు, విధ్వంసంపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. దుర్గాదేవి మండపాలపై జరిగిన, దాడి హింసలో నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో స్పందించిన ప్రధాని.. హిందూ ఆలయాలు, దుర్గా మండపాలపై దాడులకు తెగబడే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 22 జిల్లాల్లో పారామిలటరీ బలగాలను మోహరించారు.
కొమిల్లలోని దుర్గాదేవి మండపంపై దాడికి తెగబడిన దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మండపంలో విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులు మరణించారు. జరిగిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ప్రధాని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మతంతో సంబంధం లేదని హసీనా స్పష్టం చేశారు. వారిని పట్టుకుని శిక్షించి తీరుతామని హిందూ సమాజానికి హామీ ఇచ్చారు.
 
ఢాకాలోని దక్షేశ్వరి నేషనల్ టెంపుల్‌లో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న హసీనా హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది టెక్నాలజీ యుగమని, సాంకేతికతను ఉపయోగించి హిందు ఆలయాలపై దాడులకు పాల్పడిన వారు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షించి తీరుతామని హెచ్చరించారు. 
“మేము పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఇది సాంకేతిక యుగం.ఈ సంఘటనలో పాల్గొన్న వారు సాంకేతిక 
ఉపయోగించడంతో ఖచ్చితంగా ట్రాక్ చేయబడతారు” అని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఏదైనా మతపరమైన హింస పెరగకుండా భారతదేశం అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. “అక్కడ (భారతదేశంలో) ఏమీ జరగదని మేము ఆశిస్తున్నాము.  అది బంగ్లాదేశ్‌లోని ఏదైనా పరిస్థితిని ప్రభావితం చేస్తుంది, ఇక్కడ మన హిందూ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది,” అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, దాడులపై స్పందించిన భారత ప్రభుత్వం కూడా నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.