అఫ్గాన్‌ మసీదులో బాంబు పేలుళ్లు.. 37 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ సిటీలో శుక్రవారం బాంబు పేలుళ్లతో బీభత్సం జరిగింది. నగరంలో షియా తెగకు చెందిన అతి పెద్ద మసీదు అయిన ఇమామ్ బర్గా మసీదులో వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం  37మంది మరణించగా.. 70  మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

వరుసగా మూడు బాంబు పేలుళ్లు జరిగాయని, మొదట మెయిన్‌ డోర్ దగ్గర, ఆ తర్వాత మసీదులో దక్షిణ భాగంలో, మూడోది ప్రార్థనలకు ముందు కాళ్లు కడుక్కునే చోట బ్లాస్ట్స్ జరిగాయని ప్రత్యక్ష సాక్షి తెలిపినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే చేసినట్లు ప్రకటించుకోలేదు. 

షియా తెగ ముస్లింల శుక్రవారం ప్రార్థనలను టార్గెట్ చేసి ఉగ్ర మూకలు అఫ్గాన్‌లో ఇలా బాంబు దాడులకు పాల్పడడం ఇది వరుసగా రెండో వారం. గత శుక్రవారం కుందుజ్ సిటీలో ఓ మసీదుపై ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి, దాదాపు 100 మంది సామాన్యలును బలి తీసుకున్నారు.

తాలిబాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్‌ ఖోస్తీ కాందహార్‌‌లోని షియా మసీదుపై జరిగిన దాడి తమను ఎంతో బాధించిందని పేర్కొన్నాంటూ ట్వీట్ చేశాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు బాధ్యులను పట్టుకుని, శిక్షిస్తామని పేర్కొన్నాడు.

అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉన్న షియా తెగ ముస్లింలను ఎప్పటి నుంచో ఐఎస్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల తాలిబాన్లు అఫ్గాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కాబూల్ ఎయిర్‌‌పోర్ట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు చేసిన ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడి కూడా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహిళా సాకర్ ప్లేయర్ల తరలింపు

ఇలా ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి సాకర్ క్రీడాకారిణులను కాబూల్ నుంచి దోహాకు తరలించినట్లు కతార్ ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 100 మంది ఫుట్‌బాలర్స్‌ను, వారి కుటుంబ సభ్యులతో సహా, తరలించినట్లు కతార్ అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ లోల్వాహ్ అల్ ఖతెర్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.  ఎఫ్ఐఎఫ్ఎ తో సమన్వయం కుదుర్చుకుని వీరిని తరలించారు. 

దోహాకు వెళ్లినవారిలో ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. వీరందరికీ కరోనా వైరస్ పరీక్షలు చేయించారు. వీరంతా కతార్‌లో ఎంత కాలం ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. ఈ క్రీడాకారిణుల తరలింపు కోసం తాము సహకరించినట్లు ఎఫ్ఐఎఫ్ఎ  (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) కూడా తెలిపింది.

కతార్ ప్రభుత్వంతో చర్చించి, 100 మంది ఫుట్‌బాలర్స్, వారి కుటుంబ సభ్యులను విమానంలో తరలించినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత మహిళా అథ్లెట్ల భద్రత, రక్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.