చైనాకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్ మసీద్ పై దాడి 

వీఘర్ ముస్లింల కోసం పోరాడే సంస్థలను నిలువరిస్తామని ఇచ్చిన హామీని తాలిబన్లు నెరవేర్చడం లేదని చైనా ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం గత శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్‌లో ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి వీఘర్ ముస్లిం కావడమే. 

దీంతో తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘన్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనపై చైనా పునఃసమీక్షిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది.  అమెరికన్ మీడియాలో ప్రచురితమైన ఓ వ్యాసంలో తెలిపిన వివరాల ప్రకారం, వీఘర్ ముస్లింల సమస్యలపై పోరాడే సంస్థలను నిలువరిస్తామని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు.

అయితే గత శుక్రవారం ఆఫ్ఘన్‌లోని కుందుజ్‌లో ఓ షియా మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి వీఘర్ ముస్లిం అని తెలిసింది. ఈ దాడికి తమదే బాధ్యత అని ఆఫ్ఘన్‌లోని ఐఎస్ఐఎస్-కే అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తోంది.

దీంతో తాలిబన్లు ఇచ్చిన హామీలకు ఉన్న విలువను చైనా జాతీయ భద్రతాధికారులు ప్రశ్నిస్తున్నారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో వీఘర్ ముస్లింలు అధికంగా ఉంటారు. ఇంటా, బయటా హింసను అణచివేయాలన్న లక్ష్యంతో వీరిపై చైనా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. కుందుజ్ దాడిని ఓ సూచనగా చైనా పెద్దలు భావిస్తున్నారు.

వీఘర్ల కోసం పోరాడే సంస్థలకు ఆఫ్ఘనిస్థాన్ స్వర్గధామంగా మారకుండా నిరోధించడం సహా ఇతర హామీలను తాలిబన్లు నెరవేర్చడం లేదని ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి ఎక్కువ పెట్టుబడులను రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థతో తాలిబన్లకు సంబంధాలు ఉన్నాయనే అనుమానం చైనా పెద్దలకు వచ్చింది.

స్టిమ్సన్ సెంటర్‌లో చైనా ప్రోగ్రామ్ డైరెక్టర్ యున్ సున్ మాట్లాడుతూ, తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగిన అతి పెద్ద దాడి ఇదే (కుందుజ్ మసీదుపై దాడి) అని చెప్తూ, ఓ వీఘర్ ముస్లిం ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 

గురుద్వారా అపవిత్రం చేసిన తాలిబన్లు

ఇలా ఉండగా, తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిపై దారుణాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కాబూల్‌లోని కర్టే పర్వాన్‌లో ఉన్న గురుద్వారా దష్‌మేష్‌లో తాలిబన్లు బలవంతంగా ప్రవేశించి అపవిత్రం చేశారు.

ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి కాబూల్‌లోని సిక్కు సమాజం నుంచి తమకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు.

శుక్రవారం  మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో ఆయుధాలు ధరించిన కొందరు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక యూనిట్‌కు చెందినవారమంటూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని పునీత్ సింగ్ తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని పేర్కొన్నారు.

గురుద్వారా అంతా కలియదిరిగారని, దానిని అనుకున్న ఉన్న స్కూల్‌లోకీ ప్రవేశించారని వివరించారు. వారిని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుపై చేయిచేసుకున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు.