మావోయిస్టు అగ్రనేత ఆర్కే (65) కన్నుమూశారు. కొంతకాలంగా దక్షిణ బస్తర్ అడవుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. పెరాలసిస్, లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌తో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ధ్రువీకరించారు.
ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దండకారణ్యం పరిధిలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఆయన మరణించినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తుండగా.. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సరైన వైద్యానికి నోచుకోక పరిస్థితి విషమించి చనిపోయినట్లు చెబుతున్నారు.
ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యమ నేతగా మారిన సమయంలోనే తన పేరును రామకృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ తర్వాత విప్లవోద్యమంలో అగ్రనేతగా ఎదిగారు.
ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏపీ ఒడిశా సరిహద్దు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బయటకు వచ్చారు. 2004 అక్టోబర్ 15న వైఎస్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు.
2003లో అలిపిరి వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి వెనుక కూడా ఆర్కే కీలక సూత్రధారి. చంద్రబాబు, ఎస్పీ లడ్డాపై దాడి కేసు సహా దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దాదాపు 85 కేసుల్లో ఆర్కే నిందితుడు. ఈయనపై 200 మంది పోలీసుల ఎన్‌కౌంటర్ కేసులు ఉన్నాయి.
ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. మొత్తం నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేపై 40 లక్షల రివార్డును ప్రకటించగా.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం 25 లక్షలు, ఒడిశా ప్రభుత్వం 20 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం 12 లక్షల రివార్డులు ప్రకటించాయి.
ఆర్కే చాలాసార్లు పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా నడుస్తూ ఉండేది. కానీ, మళ్లీ ఆయన కదలికలు మొదలయ్యేవి.
2018 మే నెలలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన భీకర బలిమెలఎన్‌కౌంటర్‌లో ఆర్కే తృటిలో తప్పించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ౩2 మంది మావోయిస్టులు మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ సమయంలోనే ఆర్కే కుమారుడు మరణించాడు.
అదే ఎన్‌కౌంటర్‌లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. అప్పటి నుంచి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆర్కే కోలుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. మొదటిసారి గుంటూరు జిల్లాలో ఏకోనాంపేట వద్ద కృష్ణానది తీరంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో తృటిలో తప్పించుకున్నాడు.
విశ్వసనీయవర్గాల ప్రకారం, కీలకమైన పొలిట్‌బ్యూరో సమావేశం జరిగిన తర్వాత ఆరుగురు సభ్యులకు కరోనా సోకింది. వీరిలో ఆర్కే కూడా ఉన్నారు. అయితే, వ్యాయామసూత్రాలు పాటిస్తూ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా అనంతర సమస్యలు మాత్రం ఆయనను తీవ్రంగానే వెంటాడాయి. చాన్నాళ్లు ఆయనకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు శ్వాసకోశ సమస్యలు వచ్చాయని తెలుస్తున్నది. బరంపురం, రాయ్‌పూర్ సమీపంలో చికిత్స తీసుకున్నట్లు తెలిసింది.
ఆర్కేతోపాటు విష్ణురాయ్ అనే మరో కీలక నేతను బిహార్ లేక రాయ్‌పూర్‌కు పంపించాలనుకున్నారు. అదీ కుదరకపోవడంతో ఆర్కేకు మహారాష్ట్రలో వైద్యం చేయించినట్లు తెలిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఓ సుదీర్ఘ సమావేశంలోనూ ఆర్కే పాల్గొన్నారని తెలిసింది. ఈ సమావేశం అనంతరం మల్కన్‌గిరి ఏరియా కమిటీ సమావేశం నిర్వహించాలని ఏవోబీ కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం సన్నద్ధమవుతుండగనే ఆర్కే తీవ్ర అనారోగ్యానికి చనిపోయినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా మాచర్లలోని ప్రభుత్వ కళాశాలలో చదివేటప్పుడు రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. ఆ తర్వాత వరంగల్ లో బిటెక్ చదివేసమయంలో నక్సల్ ఉద్యమంలో చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆమె టీచర్‌గా పనిచేశారు. ఆమెపై కూడా పలు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచర్‌గా పనిచేశారు.
ఇదిలాఉండగా.. కీలక నేతల వరుస మరణాలు మావోయిస్ట్ పార్టీ ని అయోమయంలో పడేశాయి. కరోనాతో పాటు అనారోగ్య సమస్యల తో ఒక్కొక్కరు గా నేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు