మరిన్ని మెరుపు దాడులు తప్పవు… పాక్ కు హెచ్చరిక

సరిహద్దుల్లో అతిక్రమణలు, కాశ్మీర్ లో దాడులను ఆపని పక్షంలో మరిన్ని మెరుపు దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా హెచ్చరించారు. 

తాము దాడులను సహించేది లేదని తమ మెరుపు దాడుల ద్వారా నిరూపించామని, ఒక వేళ మీరు అతిక్రమణలకు పాల్పడితే..మరిన్ని మెరుపు దాడులు జరిగే అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. గోవాలోని ధర్బండోరా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీ శంకు స్థాపన సందర్భంగా పాకిస్తాన్‌కు ఈ హెచ్చరికలు చేశారు. 

 ‘ప్రధాని మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్ ఓ చారిత్రాత్మక ఘటన. దాని ద్వారా భారత సరిహద్దులను ఎవరూ చెరపాలన్న చూసిన వారికి ఇదే గతి పడుతుందని తెలిసేలా చేశాం. గతంలో చర్చించే వాళ్లం, కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే సమయం’ అని అమిత్ షా తేల్చి చెప్పారు. 

అదే విధంగా, చాలా సంవత్సరాలుగా మన సైనికులు ఎదురు శూస్తున్న ” ఒకే ర్యాంక్ – ఒకే పెన్షన్” ను అమలు పరచిన ఘనత కూడా మోదీ, పారికర్ లదే అని గుర్తు చేశారు. ఇక్కడ ప్రారంభిస్తున్న ఫోరెన్సిక్ యూనివర్సిటీ నేరాలకు శిక్షలు ఎక్కువగా పడేందుకు అవకాశం కలిగిస్తోందని, ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో ఎక్కువ మానవ వనరులను అందిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు కలిగిస్తోందని వివరించారు. 

కాగా, భారత్‌లో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌లో భారత ప్రభుత్వం మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29 న మెరుపు దాడులు జరిగాయి.

ఇలా ఉండగా, వచ్చే ఏడాది మొదట్లో గోవా అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో బిజెపి పూర్తి ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. గత దశాబ్దంగా గోవాకు బిజెపి సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధిని అందించిందని కొనియాడారు.