వచ్చేవారం 100 కోట్ల టీకాల మైలురాయి!

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ మరో ఘనతను సాధించనున్నది. వచ్చే వారం వంద కోట్ల (ఒక బిలియన్‌) డోసులను పూర్తి చేయనున్నది. రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయికి భారత్ చేరుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గొప్ప విజయమని పేర్కొంది.

అంతేగాక వంద కోట్ల టీకా డోసుల మైలురాయి ప్రత్యేకతను ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తున్నది. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద, నార్త్‌, సౌత్‌ బ్లాక్‌లలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నది.  విమానాల లోపల, ఎయిర్‌ పోర్టులు, రైల్వేస్టేషన్లతోపాటు రైళ్లలో, ఓడల్లో, బస్టాండ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఎనౌన్స్‌మెంట్‌ చేస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పాల్గోవాలని బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆ పార్టీ సూచించింది.

కాగా, దేశంలో టీకా డ్రైవ్‌ చేపట్టిన ఈ ఏడాది జనవరి నుంచి గురువారం సాయంత్రం వరకు సుమారు 97 కోట్ల డోసులను ప్రజలకు వేశారు. కోవిన్‌డాష్ ‌బోర్డు ప్రకారం గురువారం సుమారు 27 లక్షల డోసుల టీకాలు ప్రజలు తీసుకున్నారు. ఇందులో 50 శాతానికి పైగా అంటే సుమారు 15 లక్షల మేర రెండవ  డోసు పొందారు.

మరోవైపు ఈ నెలలో 22 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సిరం సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. అలాగే తాము ఆరు లక్షల కొవాగ్జిన్‌ డోసులను అందజేస్తామని భారత్ ‌బయోటెక్‌ పేర్కొంది. జైడస్ కాడిలా మూడు మోతాదుల డీఎన్‌ఏ వ్యాక్సిన్ జైకోవ్‌డీ కూడా 60 లక్షల డోసులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.

దీంతో దసరా నేపథ్యంలో మందగించిన టీకా డ్రైవ్‌ను పండుగ అనంతరం వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.