అక్టోబ‌ర్ 20 వ‌ర‌కూ జైలులోనే ఆర్య‌న్ ఖాన్

క్రూయిజ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఈనెల 20 వ‌ర‌కూ జైలులో గ‌డ‌ప‌నున్నాడు. ఆర్య‌న్ బెయిల్ పిటిష‌న్‌పై ముంబై కోర్టులో వాద‌న‌లు ముగియ‌డంతో తీర్పును న్యాయ‌మూర్తి రిజర్వ్‌లో ఉంచారు. 

ద‌స‌రా తర్వాత ఈనెల 20న తాను ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆర్య‌న్ ఖాన్ త‌ర‌చూ డ్ర‌గ్స్ సేవిస్తాడ‌ని ఎన్సీబీ కోర్టుకు నివేదించింది. త‌న క్లెయింట్ డ్ర‌గ్స్‌కు బానిస కాద‌ని, అయినా డ్ర‌గ్స్‌కు బానిసైన వారి ప‌ట్ల‌ సానుభూతితో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని ఆర్య‌న్ ఖాన్ న్యాయ‌వాది అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.

ద‌ర్యాప్తునకు విఘాతం క‌ల‌గ‌కుండా ష‌రతుల‌తో బెయిల్ మంజూరు చేయ‌వ‌చ్చ‌ని కోర్టును అభ్య‌ర్ధించారు. వాట్సాప్ చాట్స్‌ను ఆధారాలుగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఎన్సీబీ వాద‌న ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు. ఆర్య‌న్‌కు అంత‌ర్జాతీయ డ్ర‌గ్ ట్రాఫికింగ్‌లో ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఈ బాలుడికి అంత‌ర్జాతీయ డ్ర‌గ్ ట్రాఫికింగ్‌తో సంబంధం ఉందా అని కోర్టును ఉద్దేశించి ప్ర‌శ్నించారు. ఇవి పూర్తిగా అసంబద్ధ‌మైన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని చెప్పారు. 

రేవ్ పార్టీ గురించి ఆర్య‌న్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు లేవ‌ని తెలిపారు.కాగా అక్టోబ‌ర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్‌లో జ‌రిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడుల్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ స‌హా ప‌లువురు ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా,. ఈ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసును రియా చ‌క్ర‌వ‌ర్తి, షోవిక్ కేసుతోనార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోల్చింది. ఆర్య‌న్ ఖాన్ ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ ఏవీ దొర‌క‌నంత మాత్రాన అత‌నికి బెయిల్ ఇవ్వాల‌ని ఏమీ లేద‌ని ఏఎస్‌జీ అనిల్ సింగ్ కోర్టులో వాదించారు.

గ‌తంతో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి ద‌గ్గ‌ర కూడా ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ‌క‌పోయినా.. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల‌ని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్య‌న్ ఖాన్ గ‌త కొన్నేళ్లుగా రెగ్యుల‌ర్‌గా డ్ర‌గ్స్ తీసుకుంటాడ‌ని మీ ముందు ఉన్న రికార్డు, ఆధారాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఆర్య‌న్ స్నేహితుడు అర్బాజ్ ఖాన్ ద‌గ్గ‌ర ల‌భించిన డ్ర‌గ్స్ వాళ్లిద్ద‌రూ తీసుకోవ‌డం కోస‌మే అని అనిల్ సింగ్ వాదించారు. ఆర్య‌న్‌కు బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయ‌న కోర్టును కోరారు.

మరోవంక,   ఆర్యన్ ఖాన్‌తో వైరల్ సెల్ఫీలో కనిపించిన ప్రైవేట్ డిటెక్టివ్ గోసవిపై పోలీసులు దృష్టి సారించారు. మూడు చీటింగ్ కేసుల్లో నిందితుడైన గోసవిపై ఇప్పుడు పూణే పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ దిగటంతో ఆర్యన్ ఖాన్ కు గోసవికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

2018లో ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌ లో నమోదైన చీటింగ్ కేసులో పరారీలో ఉన్న కెపి గోసవిపై మేము లుకౌట్ సర్క్యులర్ నోటీసు జారీ చేశామని పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా తెలిపారు. క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ, డ్రగ్స్ రికవరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది స్వతంత్ర సాక్షులలో గోసవి ఒకరు. 

కాగా, ఈ కేసులో గోసవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్న అనుమానంతో అతనిని అరెస్ట్ చెయ్యటం కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే గోసవిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని పూణేకు చెందిన వ్యక్తిని మోసం చేసినందుకు గోసవిపై కేసు నమోదైందని పేర్కొన్నారు.