ఏపీ ప్రభుత్వ తీరు “అధోగతి” వైపు.. బీజేపీ

కేంద్రం చూపు “గతి శక్తి ” వైపు వెళ్తుంటే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  తీరు “అధోగతి” వైపు ఉందని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పాతికేళ్ల ప్రగతికి “గతి శక్తి ” అని అంటే, రాష్ట్ర భవిష్యత్తుని రుణ భారంతో “దారుణాoధ్రప్రదేశ్”గా మార్చారని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం రూ 100 లక్షల కోట్ల ఉత్పాదక భారీ ఇన్ఫ్రా ప్రణాళిక వేస్తే, రాష్ట్రం రుణా మేళాలలో తెచ్చిన డబ్బు అనుత్పాదక వ్యయం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం గత సంవత్సరం రూ  100 లక్షల కోట్ల ప్రాజెక్టులను నిర్ణీత సమయంలోపు రాష్ట్రాలను ఏంపిక చేసుకొమ్మని అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయిన ఏంపిక చేసుకోని దౌర్భాగ్యమని విమర్శించారు. 

వాటర్, శానిటైజేషన్, సామాజిక మౌలిక సదుపాయాలు, పవర్, రోడ్డులు, రైల్వే, నౌకాశ్రయలు, ఎయిర్పోర్ట్లు, ఒ ఏఫ్ సీ, హాస్పిటల్స్, వ్యవసాయధారిత  తదితర ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఈ రూ  100 లక్షల కోట్ల ప్రాజెక్టులలో పొందుపరచిందని దినకర్ తెలిపారు. పీపీఏ పద్ధతిలో కేంద్రం 39%, రాష్ట్రాలు 40% , ప్రయివేటు 21% భాగస్వామ్యంతో  మొత్తం 6835 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రకటిస్తే, వీటిని ఎంపిక చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ఈ రూ 100 లక్షల కోట్లలో రూ 42 లక్షల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక్క ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేదని విచారం వ్యక్తం చేశారు.  “గతి శక్తి” తో దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అవకాశంతో పాటు దేశాన్ని “ఆర్థిక శక్తి”గా మార్చే అవకాశం ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం “అంధేరాప్రదేశ్” గా మారుస్తోందని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా,  ‘‘మాదక ద్రవ్యాల కేసులో రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందని,  అది మరింత దిగజారే ప్రమాదం ఉంని హెచ్చరించారు. అడ్రస్‌ అంటే అడ్డా కాదా? అడ్రస్‌ లేనోడిని సమాజం ఏమంటుంది? ఒక అడ్రస్ తో  బుకింగ్‌ జరిగిందంటే అది ఆరిజన్‌ ఆఫ్‌ క్రైమ్‌ కాదా? అని  ప్రశ్నించారు. ఇంత పెద్ద కేసును వ్యక్తులకు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందేందుకు, ప్రభావం తగ్గించేందుకు రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తున్నాయని దినకర్‌ ఆరోపించారు.