ఏపీలో దసరా తర్వాత అధికారికంగా విద్యుత్ కోతలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్తు సంక్షోభం అంచుకు చేరుకోవడంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  విద్యుత్తుశాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలే అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో స్థానికంగా అనధికారికంగా విద్యుత్ కోతలను అమలు పరుస్తున్నారు. 

బొగ్గుకొరతతో ఆ రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో సుమారు 40 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్తు ఉత్పత్తి తగ్గిందని ఉన్నతాధికారులు ప్రకటించారు. అన్ని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో ఒకటిరెండు రోజులకు సరిపడేంత బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంతో రైల్వే ర్యాక్‌ల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. అయినప్పటికీ చాలాచోట్ల విద్యుత్తు కోతలు గంటల తరబడి తప్పడంలేదు.

 శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి రోజూ నాలుగు గంటలపాటు పరిశ్రమలకు విద్యుత్తును నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్ర 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడవద్దని ఇంధనశాఖ కార్యదర్శి విజ్ఞప్తిచేశారు. వార్షిక మరమ్మత్తుల పేరుతో రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను మూసివేయకపోయినా బొగ్గుకొరతతో మూతపడేదని రాష్ట్ర మంత్రి స్వయంగా చెప్ప డం గమనార్హం. 

ప్రజల అవసరాలమేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితికూడా కనపడటం లేదని ఏపీ అధికారులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు యూనిట్‌ రేటు ఊహించని స్థాయికి చేరింది. సెప్టెంబర్‌ 16న యూనిట్‌కు రూ.4.60 ధర ఉంటే, సెప్టెంబర్‌ నెలాఖరుకు రూ.9.40కి, అక్టోబర్‌ 6 నాటికి రూ.14కు పెరిగింది. దీంతో అంత ధర పెట్టి కొనలేమని అక్కడి ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. 

 కృష్ణపట్నంలో మరో యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమవడంతో.. కొంతమేర కష్టాలు తీరతాయని అధికారులు భావించారు. కానీ ముద్దనూరు రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ)లో మరో యూనిట్‌ను మంగళవారం షట్‌డౌన్‌ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆర్‌టీపీపీలో ఇప్పటికే 3యూనిట్లలో ఉత్పత్తి ఆగిపోయింది.