శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనమివ్వగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  అనంతరం జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయ జీయర్లు శేషవస్త్రంతో వైఎస్‌ జగన్‌ను సత్కరించారు. స్వామివారి దర్శనానంతరం రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూరాలని ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని సీఎం ప్రార్థించారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.

రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు.

తొలుత, బర్డ్‌ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ. 64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆస్పత్రిలో వైద్య సేవలందించే వివిధ విభాగాలను పరిశీలించారు. ఇక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య సేవలను అందించనుంది. 

ఈ నెల 12వ తేదీ మంగళవారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ మొదటి వారం నుంచి శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. దీంతో ఈ తరహా చికిత్సలకు ఇకపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

సప్త గోప్రదక్షిణ మందిర సముదాయం 

తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ సకల దేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. 

కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రాన్నీ ఏర్పాటుచేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచారు. వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్‌ నిర్మించారు. గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించిన జగన్‌ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చిగడ్డిని తినిపించి నమస్కరించారు. 

ఇక్కడ ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం ఏర్పాటుచేశారు.  గోదర్శనం, గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యం, గ్రాసంగానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించారు.