స్వయం ఉపాధి పథకాలకు జగన్ ప్రభుత్వం మంగళం

జగన్‌ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు మంగళం పలికేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా బడుగు వర్గాలకు అందాల్సిన సహకారం పూర్తిగా ఆగిపోయింది. నవరత్నాల్లోనే స్వయం ఉపాధి చూసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. 

లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే మొత్తంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయని.. మరే ఇతర పథకాలూ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా..  వాటినీ నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఏటా రూ.2 వేల కోట్ల మేర స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు.. ఈ 28 నెలల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొండి చేయి చూపారు.

రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయించారు. కానీ అవి వాటిని ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆ నిధులను నవరత్న పథకాలకు మళ్లించి.. కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేసినట్లు పుస్తకాల్లో సర్దుబాటు చేస్తోంది.  నవరత్నాల పథకాలకు నిధులను ఈ కార్పొరేషన్ల నుంచే ఇస్తున్నా వాటి లబ్ధిదారుల్లో ఒక్కరిని కూడా వాటి చైర్‌పర్సన్లు గానీ, డైరెక్టర్లు గానీ ఎంపిక చేయడం లేదు. 

లబ్ధిదారుల ఎంపిక గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో జరుగుతోంది. దీంతో కార్పొరేషన్లన్నీ నిధుల సర్దుబాటు సంస్థలుగా మారిపోతున్నాయి. ఇదివరలో ప్రతిఏటా వేల మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా పలు రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారు. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు.

ఎస్సీ యువతకు వారి అభిరుచి మేరకు వారికి నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసేందుకు 60 శాతం దాకా సబ్సిడీ అందించేవారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌టీఎ్‌ఫడీఎస్‌) సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలిచ్చింది.

ఏటా 50వేల మంది ఎస్సీ, 5వేల మంది ఎస్టీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందుతుండేవారు. జగన్‌ సర్కారు వచ్చాక ఏకంగా స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీని నాటి సీఎం చంద్రబాబు పునరుద్ధరించగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది. దీంతో వేల మంది ఎస్టీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం ఐదు కులాలకు చెందినవారి సంక్షేమమే బీసీ సంక్షేమమంటూ.. మిగతావారిని గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం 137 రకాల బీసీ కులాలను కలిపి.. 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్ల ద్వారా ఏటా రూ.1,000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తే.. ఈ ప్రభుత్వం నవరత్నాల పేరిట కేవలం 4.37 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలు మంజూరుచేసి.. బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నది.