ఇష్టానుసారం అప్పులు  చేస్తున్న వైసిపి ప్రభుత్వం 

వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని  మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌  ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు 6 లక్షల కోట్ల అప్పు చేసిందని,  అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

 ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణని చెబుతూ ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు.

 పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారని, నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదని విమర్శించారు.  టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని, ఏమాత్రం పురోగతి లేదని చెప్పారు. .

తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. కరోనా కల్లోలం నుంచి బయటపడాలంటే ప్రజల అకౌంట్‌లో డబ్బులు వేయాలని చాలామంది నిపుణులు చెప్పారని గుర్తు చేస్తూ  కారణాలు వేరైనా నవరత్నాలతో అందరి అకౌంట్‌లలో డబ్బులు వేశారని తెలిపారు. అయితే  ఎప్పుడూ అలా చేయాలంటే అసాధ్యమని పేర్కొన్నారు.