అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ కు సంబంధాలు!

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ కొందరు విదేశీయులతో టచ్‌లో ఉన్నట్లు నార్కొటిక్స్ బ్యూరో తెలిపింది. సదరు విదేశీయులు ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన వారని ఎన్సీబీ ఆరోపించింది. 

ఏడురోజులుగా ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ వేసిన బెయిలు పిటిషన్‌ విచారణ సందర్భంగా ఎన్సీబీ ఈ వివరాలు వెల్లడించింది. ఆర్యన్‌ బెయిలు పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎన్సీబీ వాదిస్తూ అక్రమంగా డ్రగ్స్ సంపాదించడం కోసమే ఈ సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇలా అక్రమంగా సంపాదించిన వస్తువుల పంపిణీలో కూడా ఆర్యన్‌ పాత్ర ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్సీబీ పేర్కొంది. ఆర్యన్‌, అర్బాజ్ మర్చంట్‌కు ఆచిత్, హరిజన్ అనే వ్యక్తులు చరస్ సరఫరా చేసినట్లు తెలుస్తోందని ముంబై కోర్టుకు ఎన్సీబీ వెల్లడించింది. 

క్రూయిజ్ డ్ర‌గ్ కేసుకు సంబంధించి ఇత‌ర నిందితుల త‌ర‌హాలో ఆర్య‌న్ ఖాన్ హ‌స్తం కూడా ఉంద‌ని ఎన్సీబీ స్ప‌ష్టం చేసింది. నిందితుడు కుట్ర‌లో పాలుపంచుకున్నాడ‌ని తెలిపింది. ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్‌లో రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు జ‌రిపిన దాడుల్లో ఆర్య‌న్ ఖాన్ స‌హా ప‌లువురు ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే.

కాగా,   అర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్ తరపున లాయర్ మొదట వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఎన్సీబీ తరపున అడిషనల్ సోలిసిటరల్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే సమాయాభావం వల్ల విచారణను గురువారానికి వాయిదా వేశారు. 

మేజిస్ట్రేట్ కోర్టు అక్టోబర్ 8న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసు విచారణ అక్టోబర్ 13న ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 20 మంది నిందితుల‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. గ‌త వారం ఆర్య‌న్‌ను 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్టడీకి త‌ర‌లించ‌గా ఆయ‌న బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్ర‌యించాడు.