ఆఫ్ఘన్‌ తీవ్రవాదంకు కేంద్రంగా మారకుండా చూడాలి

ఆఫ్ఘన్‌ గడ్డ తీవ్రవాదానికి కేంద్రంగా మారకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఆ దేశంలో ఆశించిన మార్పు తీసుకురావడానికి ఐక్యంగా ప్రయత్నించాలని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన జి 20 అసాధారణ సమావేశంలో మోదీ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. 

తీవ్రవాదం, రాడికలైజేషన్‌ మధ్య గల సంబంధాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేయాలని ప్రధాని పిలుపిచ్చారు.   ఆఫ్ఘనిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితిది చాలా కీలక పాత్ర అని చెబుతూ దానికి భారత్‌ తోడ్పాటు వుంటుందని హామీ ఇచ్చారు. ఆఫ్ఘన్‌ పౌరులకు అత్యవసర ప్రాతిపదికన ఎలాంటి అంతరాయాలు లేకుండా మానవతా సాయం అందించాలని ప్రధాని స్పష్టం చేశారు. 

ఆ దేశంలో ప్రభుత్వం అందరినీ కలుపుకుని పోయేలా వ్యవహరించాల్సిన అవససరం వుందని పేర్కొంటూ అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రధాని మోదీ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593 ప్రాతిపదికన అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని చెప్పారు.  

ఆఫ్ఘన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యల బాధ ప్రతి భారతీయుడికీ తెలుసని, వారికి తక్షణమే మానవతా సాయం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై వుందని ప్రధాని స్పష్టం చేశారు.

“ప్రతి భారతీయుడు ఆఫ్ఘన్ ప్రజల బాధను గ్రహిస్తున్నాడు” అని ప్రధాని చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య శతాబ్దాల నాటి ప్రజల మధ్య సంబంధాలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో యువత, మహిళల సామాజిక-ఆర్థిక అభివృద్ధి, సామర్ధ్యాల అభివృద్ధికి భారతదేశం దోహదపడిందని కూడా ఆయన గుర్తు చేశారు.

“ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన జి 20 సమ్మిట్‌లో పాల్గొన్నాను. ఆఫ్ఘన్ భూభాగం రాడికలైజేషన్,  తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించడంపై ఒత్తిడి చేసాను. ఆఫ్ఘన్ పౌరులకు అత్యవసర, అవరోధం లేని మానవతా సహాయం అందించాలని, అందరిని కలుపుకొని పరిపాలన చేయాలని కూడా పిలుపునిచ్చారు ”అని మోదీ ట్వీట్ చేశారు.

ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న జి-20 కు ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న ఇటలీ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాఘీ అధ్యక్షత వహించారు.