స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే విజయపతాకం 

తమిళనాడులో తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆ జిల్లాల్లోని జిల్లా పంచాయతీ యూనియన్లు అన్నింటినీ కైవసం చేసుకోనుంది. జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యులుగా డీఎంకే పార్టీకి చెందిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలిచారు. 

ఆరు నెలల కిందటనే స్పష్టమైన ఆధిక్యతతో  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంకె స్టాలిన్ సహజంగానే తిరిగి అదే విధంగా ప్రజల మద్దతు పొందగలిగారు. రాత్రి ఎనిమిది గంటలకు వెలువడిన ఫలితాల్లో డీఎంకే 140 జిల్లా పంచాయతీ యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకుగాను 99 మంది డీఎంకే సభ్యులే గెలిచారు.

అన్నాడీఎంకే తరఫున ఐదుగురు కౌన్సిలర్లు గెలిచారు. ఇక 1381 యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకు జరిగిన ఎన్నికల్లో 325 మంది డీఎంకే అభ్యర్థులు గెలిచారు. అన్నాడీఎంకే తరఫున 47 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఓ చోట డీఎండీకే తన ఖాతాను తెరిచింది. ఈ ఎన్నికల్లో పీఎంకే ఒక స్థానాన్ని గెలుచుకోగా, బీజేపీ, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం, నామ్‌ తమిళర్‌ కట్చి ఘోరపరాజయాన్ని చవిచూశాయి. పలుచోట్ల డిపాజిట్లను కూడా కోల్పోయాయి.

ఈనెల ఆరున 39 యూనియన్‌ పంచాయతీలు, 78 జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యులు, 755 యూని యన్‌ పంచాయతీ సభ్యుల పదవులకు, 1577 సర్పంచ్‌ పదవులకు, 12,252 పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ నిర్వహించారు. తొలివిడత ఎన్నికల్లో 77.43 శాతం మేరకు పోలింగ్‌ నమోదైంది. 

రెండో విడతగా 35 యూనియన్‌ పంచాయతీలకు, 62 జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యత్వ పదవులకు, 626 పంచాయతీ యూని యన్‌ వార్డు సభ్యుల పదవులకు, 1324 గ్రామ సర్పంచ్‌  పదవులకు, 10,329 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు గాను పోలింగ్‌ నిర్వి హంచారు. రెండో విడత ఎన్నికల్లో 73.27 శాతం పోలింగ్‌ నమోదైంది. 

ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలైన ఓట్లను 74 కౌంటింగ్‌ కేంద్రాల్లో మంగళవారం లెక్కించారు. తొమ్మిది జిల్లాలోనూ ఓట్ల లెక్కింపు చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే సాగింది.