ఎన్నికల బాండ్ల ఆదాయం టీఆర్‌ఎస్‌ కే ఎక్కువ!

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో ఎన్నికల బాండ్ల సమకూరిన ఆదాయం టీఆర్‌ఎస్‌ కు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత శివసేన, వైసిపి లకు అధిక ఆదాయం లభించింది. వివరాలు వెల్లడించిన 42 పార్టీలకు కలిపి 2019-20లో రూ 877.95 కోట్ల ఆదాయం  రాగా,   టీఆర్‌ఎస్‌ కు  బాండ్ల ద్వారా రూ.130.46 కోట్ల ఆదాయం, అంటే మొత్తంలో 14.86 శాతం  వచ్చింది.

ఆ తర్వాత శివసేనకు రూ.111.4 కోట్ల ఆదాయం (12.8 శాతం),  వైఎస్సార్‌సీపీకి  రూ.92.7 కోట్ల ఆదాయం (10.56 శాతం) వచ్చింది.  ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 42 ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయగా, వాటిలో 14 పార్టీలు మాత్రమే ఎన్నికల  బాండ్ల ద్వారా తమకు వచ్చిన ఆదాయాన్ని వెల్లడించాయని నివేదిక పేర్కొంది. ఈ 14 పార్టీలకు కలిపి రూ.447.49 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయా పార్టీల మొత్తం ఆదాయంలో 50.97శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే రావడం విశేషం.

కాగా, 24 పార్టీలు తమకు వచ్చిన ఆదాయం కంటే తక్కువ మొత్తం ఖర్చు చేశాయి టీఆర్‌ఎస్‌ తనకు వచ్చిన ఆదాయంలో 83.76 శాతం నిధులను ఖర్చు చేయలేదని వెల్లడించింది. బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. డీఎంకే, బీజేడీ, సమాద్‌వాదీ, జేడీఎస్‌ తదితర పార్టీలు కూడా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టు వెల్లడించాయి.

2018-19తో పోల్చుకుంటే 2019-20లో 23 ప్రాంతీయ పార్టీల ఆదాయం పెరగ్గా, 16 పార్టీల ఆదాయం తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి వివరాలు వెల్లడించిన 39 పార్టీల మొత్తం ఆదాయం రూ.1,087 కోట్ల నుంచి రూ.874 కోట్లకు తగ్గినట్టు నివేదిక తెలిపింది.

ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు 2015-2020 మధ్య రూ.6,500 కోట్లకు పైబడి ఖర్చు చేశాయి. వీటిలో 7 జాతీయ పార్టీలు, 11 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ మొత్తంలో సగం ప్రచారం కోసం చేసిన ఖర్చే. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీలు వార్షిక ఆడిట్‌ నివేదికలు సమర్పించాయి. 

ఎన్నికల ఖర్చులో పలు దక్షిణాది రాజకీయ పార్టీలు అగ్రభాగాన ఉన్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే (తమిళనాడు), వైసీపీ (ఏపీ), జేడీఎస్‌ (కర్ణాటక) సగటు వార్షిక ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉంది. 2015-20 మధ్య ప్రాంతీయ పార్టీల సగటు వార్షిక ఎన్నికల ఖర్చు (రూ.కోట్లలో): డీఎంకే 40.25, వైసీపీ 28.46, బీఎస్పీ 26.82, శివసేన 20.95, అన్నాడీఎంకే 17.07, జేడీఎస్‌ 10.66, ఆప్‌ 9.16, టీఆర్‌ఎస్‌ 7.61,ఎస్‌ఏడీ 4.49.