స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల ఖాతాల వివ‌రాల వెల్ల‌డి!

స్విట్జ‌ర్లాండ్‌తో చేసుకున్న స‌మాచార మార్పిడి ఒప్పందానికి అనుగ‌ణంగా ఆటోమేటిక్ రూట్ ద్వారా స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల ఖాతాల వివ‌రాల‌తో కూడిన మూడో విడ‌త జాబితాను సోమ‌వారం భార‌త్ అందుకుంది. 

గోప్యతకు మారుపేరైన స్విస్‌ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్‌ నిరంతరం పొందడానికి ఈ ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్‌ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. 

ఏటా జ‌రిగే ఈ క‌స‌ర‌త్తు ద్వారా ఐరోపా దేశం 33 ల‌క్ష‌ల ఖాతాల వివ‌రాల‌ను 96 దేశాల‌తో పంచుకుంటుంది. ఈ ఏడాది అంటిగ్వా, బార్బుడా, అజ‌ర్‌బైజ‌న్‌, డొమినికా, ఘ‌నా, లెబ‌నాన్‌, మాకావు, పాకిస్తాన్‌, ఖ‌త‌ర్‌, స‌ర్మోహ‌, వుతా వంటి మ‌రో ప‌ది దేశాల‌తో కూడా స‌మాచార మార్పిడిని పంచుకుంటున్నామ‌ని ఫెడ‌ర‌ల్ ట్యాక్స్ అడ్మిషినిస్ట్రేష‌న్ (ఎఫ్‌టీఏ)  ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

96 దేశాల‌కు చెందిన ఖాతాదారుల పేర్లు, ఇత‌ర వివ‌రాల‌ను ఎఫ్‌టీఏ బ‌హిర్గ‌తం చేయ‌లేదు. ఇక భార‌త్ వ‌రుస‌గా మూడో ఏడాది త‌మ జాతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివ‌రాల‌ను రాబ‌ట్టింది. ఈ జాబితాలో స్విట్జ‌ర్లాండ్ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధ‌ల్లో పెద్ద‌సంఖ్య‌లో ఖాతాదారులైన‌ భారతీయ వ్య‌క్తులు, కంపెనీల వివ‌రాలున్నాయి.

  స్విస్ ఆర్థిక సంస్థలలో ఖాతాలు ఉన్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు, కంపెనీలకు సంబంధించిన వివరాలు భారత అధికారులతో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు.  స్విట్జ‌ర్లాండ్‌తో ఒప్పందంలో భాగంగా 2022 సెప్టెంబ‌ర్‌లో త‌దుప‌రి భారతీయ ఖాతాదారుల స‌మాచారాన్ని ఆ దేశం భార‌త్‌తో పంచుకోనుంది.

ఈ మార్పిడి గత నెలలో జరిగింది. తదుపరి సమాచార మార్పిడి స్విట్జర్లాండ్ సెప్టెంబర్ 2022లో పంచుకోనుంది. సెప్టెంబర్ 2019లో ఏఇఓఐ(ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) కింద స్విట్జర్లాండ్ నుంచి భారతదేశం మొదటి సెట్ వివరాలను అందుకుంది. ఆ సంవత్సరం అటువంటి సమాచారాన్ని పొందిన 75 దేశాలలో మన దేశం ఒకటి. కాగా, రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదిరిన నాటి నుంచి అనేక మంది భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లోని తమ అక్రమ డిపాజిట్లను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.