ఆర్ధిక మంత్రి నిర్మల అమెరికా పర్యటన

ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాలు, జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల (ఎఫ్‌ఎంసిబిజి)సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారంపాటు అమెరికా పర్యటించనున్నారు. ఈ అధికారిక పర్యటన సందర్భంగా ఆమె అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్‌తో భేటీ కానున్నారని భావిస్తున్నారు. 

తన అధికారిక పర్యటన అక్టోబర్ 11 నుంచి మొదలుకానున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. తన అమెరికా పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్ మదుపరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాక భారత అభివృద్ధిలో భాగంపంచుకోవాలని వారిని ఆహ్వానించనున్నారు.

ఓ ఆర్థిక సర్వే ప్రకారం ప్రపంచంలోని మిగతా దేశాల ఆర్థికవ్యవస్థల కన్నా భారత్ రికార్డు స్థాయి వృద్ధి రేటు సాధించనున్నట్లు భావిస్తున్నారు. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకల్లా అంటే మార్చినాటికి 11 శాతం జిడిపి సాధించనున్నట్లు ఆ సర్వేలో వెల్లడయింది.

నిర్మలాసీతారామన్ అక్టోబర్ 13న ప్రపంచ పన్ను ఒప్పందాన్ని ఆమోదించనున్న ఎఫ్‌ఎంసిబిజి సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ డిజిటల్ సర్వీస్ పన్ను ఉపసంహరించాల్సి ఉంటుంది లేదా ‘ఈక్వలైజేషన్ లెవీ’ని పాటించాల్సి ఉంటుంది. అంతేకాక అలాంటి ఇతరములు మళ్లీ ప్రవేశపెట్టకుండా హామీ ఇవ్వలిసి ఉంటుంది.

అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్ సహా 136 దేశాలు ప్రపంచ పన్ను నియమాలను మార్పు చేసేందుకు ఒప్పుకున్నాయి. బహుళ జాతి సంస్థలు తాము పనిచేసే చోటి కనీసం 15 శాతం పన్ను కట్టేలా ఒప్పుకోవాల్సి ఉంటుంది.

అయితే, డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్, ఇతర సమాన చర్యలను ఒప్పందం ప్రకారం సభ్యదేశాలు తొలగించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మళ్లీ వాటిని ప్రవేశపెట్టడానికి కూడా వీలుండదు. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఒఇసిడి) దీనికి సంబంధించిన ప్రణాళికను శుక్రవారం విడుదలచేసింది.