ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర

ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చాల్సి ఉన్నదని చెప్పారు. 

ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన పేర్కొంటూ అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని సూచించారు. భారత అంతరిక్ష సంఘం (ఐఎస్‌పీఏ) ను సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా, ప్రధాని మోదీ పలువురు శాస్త్రవేత్తలు, ఐఎస్‌పీఏ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సెన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నాయి.

ఇతర సభ్య సంస్థల్లో గోద్రేజ్, అగిస్టా- బీఎస్‌టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్‌, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా ఉన్నాయి. ఎయిర్ ఇండియాపై తీసుకున్న నిర్ణయం తమ ప్రభుత్వ నిబద్ధత, తీవ్రతను తెలియజేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు.

పేదల ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో శాటిలైట్ ట్రాకింగ్ లేదా నావిగేషన్ టెక్నాలజీ అయినా.. పాలనను పారదర్శకంగా చేయడానికి సహాయపడుతున్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రశ్రేణి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందంజలో ఉంటే, పేదవారికి కూడా డాటాను అందుబాటులో ఉండేలా చేశామని తెలిపారు.