బొగ్గు కొరతపై విద్యుత్, బొగ్గు మంత్రులతో అమిత్ షా భేటీ 

దేశ‌వ్యాప్తంగా థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తికి వినియోగించే బొగ్గు కొర‌త ఉంద‌న్న ఆందోళ‌నల నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమ‌వారం విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషిల‌తో స‌మావేశ‌మ‌య్యారు. దేశంలో బొగ్గు నిల్వ‌ల‌పై చ‌ర్చించార‌ని తెలుస్తోంది. 

బొగ్గు గనులలో దండిగానే నిల్వలు ఉన్నాయని, సరఫరాలో జాప్యాన్ని నివారించడం జరుగుతుందని ఒక్కరోజు క్రితమే కేంద్రం తరఫున బొగ్గు, విద్యుత్ మంత్రిత్వశాఖలు ప్రకటనలు వెలువరించాయి. అయితే వాస్తవికంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను ఆరాతీసేందుకు ఈ ఇద్దరు మంత్రులతో అమిత్ షా భేటీ జరిపినట్లు స్పష్టం అయింది. 

వీరి సమావేశంలో పలువురు సీనియర్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆధీనంలోని అధికారిక ఇంధన సంస్థ ఎన్‌టిపిసి లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం పొంచి ఉందంటూ ఇప్పుటికే పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే విద్యుదుత్పాదన ప్లాంట్లకు అవసరమైనంత ‘డ్రై ఫ్యూయల్’ అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు సరఫరా జరుగుతుందని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు భరోసా ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవల్సిన తక్షణ చర్యలను బేరీజు వేసుకునేందుకు ఉన్నత స్థాయి భేటీని అమిత్ షా నిర్వహించారు. అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు. బొగ్గు కొరత లేదని, సరఫరాలో జాప్యం తలెత్తకుండా చేయాలని, బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం తలెత్తుతుందనే వాదన దుష్ప్రచారం అవుతోందని దీనిని అరికట్టాల్సి ఉందని షా అభిప్రాయపడ్డారు. కోటా సక్రమ సరఫరాతోనే పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

కాగా, ప్లహ్లాద్ జోషి ఓ ట్వీట్‌లో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరిస్థితిని సమీక్షించినట్టు పేర్కొన్నారు. విద్యత్ సరఫరాలో ఎలాంటి అవంతారాలు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. 24 రోజుల కోల్ డిమాండ్‌కు సరిపడే 43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు చెప్పారు. వినియోగం కంటే కోల్ డిస్పాచ్ ఎక్కువగా ఉందని, బొగ్గు నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయనడానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. 

దేశంలోని 135 బొగ్గు ఆధారిత థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్లాంట్ల‌లో స‌గానికి పైగా ప్లాంట్ల‌లో నిల్వ‌లు మూడు రోజుల‌లోపు విద్యుత్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన బొగ్గు మాత్ర‌మే ఉంద‌ని చెబుతున్నారు. ఈ విద్యుత్ కేంద్రాలే దేశానికి అవ‌స‌ర‌మైన 70 శాతం విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతోంది.

వివిధ దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్న బొగ్గు ధ‌ర‌లు పెర‌గ‌డం, క‌రోనా లాక్‌డౌన్‌తో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం వంటి అంశాలు దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తున్న‌ది. ఈ నెల 8న విద్యుత్ వినియోగం 3,900 మెగా యూనిట్లు. ఈ నెల తొలి 9 రోజుల్లో ఇదే అత్య‌ధికం. పంజాబ్‌తోపాటు జార్ఖండ్‌, బీహార్‌, రాజ‌స్థాన్‌ల్లో ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది.

ప‌రిమితంగా బొగ్గు ల‌భ్య‌త ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 2-6 గంట‌ల మ‌ధ్య విద్యుత్ స‌ర‌ఫ‌రా చాలా కీల‌కం. క‌నుక విద్యుత్ వినియోగ‌దారులు విద్యుత్ వాడ‌కంలో ఆచితూచి స్పందించాల‌ని అని ఢిల్లీలో విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్న టాటా ప‌వ‌ర్ అనుబంధ టాటా ప‌వ‌ర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూష‌న్ లిమిటెడ్ కోరింది. కర్ణాటక సహా పలు రాష్ట్రాలు విద్యుత్ కోతలకు సమాయత్తం అవుతున్నాయి.