బాల్య వివాహ స‌వ‌ర‌ణ బిల్లుపై వెన‌క్కి త‌గ్గిన గెహ్లాట్

బాల్య వివాహ‌ల స‌వ‌ర‌ణ బిల్లుపై తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో  రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వెనక్కు తగ్గింది. మైన‌ర్ల‌తో స‌హా అన్ని వివాహాల‌ను రిజిస్ట‌ర్ చేయాల‌ని అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం తెచ్చిన చ‌ట్టంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు వ్య‌క్తం కావడంతో గెహ్లాట్ ప్రభుత్వంకు వెనుకడుగు వేయక తప్పలేదు. 

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపిన‌ బాల్య వివాహాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకురానున్న‌ట్లు ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు. నిజానికి రాజ‌స్థాన్‌లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువ‌. అయితే ఆ ఆచారాన్ని అరిక‌ట్టాల‌న్న ఉద్దేశంతో కొత్త చ‌ట్టం తీసుకువ‌చ్ఛిన్నట్లు చెబుతూ వచ్చారు. బాల్య వివాహ‌ల‌ను అడ్డుకునేందుకు ఆ పెళ్లిళ్లు రిజిస్ట‌ర్ చేయాల‌న్న చ‌ట్టాన్ని తెచ్చామని తెలిపారు. 

అయితే ఆ స‌వ‌ర‌ణ బిల్లుపై బిజెపితో సహా ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా కూడా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. మైన‌ర్ వివాహాల‌ను రిజిస్ట‌ర్ చేయాల‌ని కోరితే, దాని వ‌ల్ల బాల్య వివాహాల‌ను ఎంక‌రేజ్ చేసిన‌ట్లు అవుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలు ఒక‌వేళ పెళ్లి చేసుకుంటే, వాళ్లు క‌చ్చితంగా పెళ్లి రిజిస్ట‌ర్ చేయాల‌ని కొత్త చ‌ట్టంలో పేర్కొన్నారు. ఆ చ‌ట్టం ప‌ట్ల అనేక అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. బాల్య వివాహాల‌ను రూపుమాపాల‌న్న ఉద్దేశంతో త‌మ ప్ర‌భుత్వం ఉంద‌ని సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్నా ఎవ్వరిని ఒప్పించలేక పోయారు. 

అన్ని పెళ్లిళ్లు రిజిస్ట‌ర్ చేయాల‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబ‌డే కొత్త చ‌ట్టాన్ని రూపొందించిన‌ట్లు గెహ్లాట్ చెప్పారు. కానీ అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్న‌ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఉన్న స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి ర‌ప్పించ‌నున్న‌ట్లు సీఎం గెహ్లాట్ వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన బాల్య వివాహాల స‌వ‌ర‌ణ బిల్లును పాస్ చేశారు. కానీ ఆ బిల్లును వ్య‌తిరేకిస్తూ బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సహితం ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.