ఆకలి, అనారోగ్యం …. తీవ్ర సంక్షోభ దిశలో ఆఫ్ఘానిస్తాన్ 

తాలిబన్ల పాలనలో అరాచక చర్యలు తప్ప పరిపాలన వ్యవస్థను గాడిన పెట్టె పరిస్థితులు కనిపించకడం లేదు. దానితో ఆ దేశం తీవ్రమైన ఆహార సమస్య, ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్‌లో ఈ ఏడాదిలోనే పోషకాహారలోపంతో 10 లక్షలమంది చిన్నారులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ వెల్లడించింది.

ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అక్కడ నెలకొన్న ఆహార సంక్షోభం  చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 30 శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్‌లో చిన్నారుల పరిస్థితులను పర్యవేక్షించేందుకు యునిసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఒమర్‌ అబ్దీ మాట్లాడుతూ… కాబుల్‌లోని ఇందిరా గాంధీ చిన్నారుల ఆస్పత్రిలో పిల్లలను పరిశీలించామని తెలిపారు. ఎంతోమంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. మిజిల్స్‌, తీవ్రమైన నీటి విరేచనాలు చిన్నారుల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నట్లు వెల్లడించారు.

యునిసెఫ్‌ గణాంకాల ప్రకారం  ప్రపంచంలో కేవలం పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌లో మాత్రమే పోలియో ఎక్కువగా ఉంది. ఆఫ్ఘన్‌ దేశ పర్యటన అనంతరం తాలిబన్‌ నేతలతో ఒమర్‌ అబ్దీ భేటీ అయ్యారు. చిన్నారులకు ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఇమ్యూనైజేషన్‌, పోషకాహారం, మంచినీరు, పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

లేకపోతే చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కరోనా, పోలియో, మిజిల్స్‌ టీకాల పంపిణీని వెంటనే పున్ణప్రారంభించాలని ఒమర్‌ అబ్దీ తాలిబన్‌ నాయకులకు సూచించారు. మరోవంక, డ్రగ్స్‌ బానిసల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్‌ బానిసలను బాధితులుగా పరిగణించి వారికి సరైన చికిత్సను అందించాల్సిందిపోయి వారిపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.

ఇస్లాం విశ్వాసాల ప్రకారం మత్తు పదార్థాల వ్యసనపరులను సమాజ వినాశకారులని పేర్కొంటున్న తాలిబన్లు ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి కర్కశ విధానాలే సరైన మార్గమని భావిస్తున్నారు. ఈక్రమంలో కొందరు మరణించినా తప్పేం లేదని, మిగిలినవారు సజ్జనులుగా మారుతారని ప్రకటిస్తున్నారు.

తాలిబన్‌ పోలీసులు రాత్రిపూట ఆకస్మిక దాడులు జరిపి డ్రగ్స్‌ బానిసలను అరెస్టు చేస్తున్నారు. వారి చేతులను కట్టేసి బలవంతంగా ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. మొండికేసినవారిని కనికరం లేకుండా తీవ్రంగా కొడుతున్నారు. జైళ్లను తలపించే ఆ శిబిరాల్లో వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని వదిలేయాలని లేకపోతే చావుదెబ్బలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.