మోదీ అంత గొప్ప‌ ప్ర‌జాస్వామ్య నేత‌ను చూడలేదు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయ‌నో నియంత అన్న విమ‌ర్శ‌ల‌ను ఖండించారు. త‌న‌కు తెలిసిన‌ గొప్ప ప్ర‌జాస్వామ్య నేత‌ల్లో మోదీ ఒక‌ర‌ని షా స్పష్టం చేశారు. “నేను మోదీతో క‌లిసి ప్ర‌తిప‌క్షంలో, అధికారంలో ప‌ని చేశాను. ఆయ‌న‌లాంటి శ్రోత‌ను నేను చూడ‌లేదు” అని త్లెఇపారు. 

ఏ అంశంపై స‌మావేశ‌మైనా మోదీ చాలా త‌క్కువ మాట్లాడ‌తారు. అంద‌రూ మాట్లాడింది చాలా ఓపిగ్గా వింటారు. ఓ వ్య‌క్తి అభిప్రాయానికి ఉండే విలువ‌ను మోదీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారని ఆయన తెలిపారు. అంతే త‌ప్ప ఆ వ్య‌క్తికి ప్రాముఖ్య‌త ఇవ్వ‌రని పేర్కొన్నారు. 

అందుకే ఆయ‌నో నియంత అన్న విమ‌ర్శ‌ల్లో ఏమాత్రం నిజం లేదు అని స‌న్స‌ద్ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమిత్ షా పేర్కొన్నారు. ప్ర‌జా సేవ‌లో మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న పాల‌న తీరును షా మెచ్చుకున్నారు. ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కేబినెట్‌ను మోదీ చాలా ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో న‌డిపిస్తారని తెలిపారు. మోదీయే అన్ని నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న భావ‌న స‌రికాదని స్పష్టం చేశారు. ప్ర‌తి అంశాన్ని ఆయ‌న చ‌ర్చిస్తారు. అంద‌రు చెప్పింది వింటారు. మంచి చెడుల‌ను బేరీజే వేస్తారు. ప్ర‌ధాన‌మంత్రి కాబ‌ట్టి ఎలాగూ తుది నిర్ణ‌యం మాత్రం ఆయ‌న‌దే అని అమిత్ షా వివరించారు.

 ఆ విధంగా వినగలిగేవారిని తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. మంచి సలహాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. మోదీపై పడని నింద అంటూ లేదని,  అయితే ఆయన వీటన్నిటినీ అధిగమించడానికి కారణం యావత్తు ప్రతిపక్షం ఆయనను బలోపేతం చేయడమేనని చెప్పారు. 

ప్రజల నమ్మకాన్ని ఆయన చూరగొనగలిగారని పేర్కొంటూ ఆయన తీసుకునే నిర్ణయాలు దేశం కోసమని, ఆ నిర్ణయం వల్ల ఆయన పొందేదేమీ ఉండదని ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ప్రజలు ఆయనను క్షమించారని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో రాజకీయ రిస్క్గురించి మోదీ వెనుకాడరని స్పష్టం చేశారు. కొన్ని సమయాల్లో దేశ సంక్షేమం కోసం కొన్ని అందరూ ఆహ్వానించలేని నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు.

మోదీ ఇతరులపై తన నిర్ణయాలను రుద్దరని పేర్కొంటూ, “ఆయనతో కలసిపనిచేసిన వారిలో ఆయన విమర్శకులు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం అంతకు ముందు ఎప్పుడూ పనిచేయక పోయినా  ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధానిగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు” అని చెప్పారు.

మోదీ క్రమశిక్షణ పట్ల పట్టుదలగా ఉంటారని, అందువల్లననే కొన్ని సమావేశాల వివరాలు వెంటనే బహిరంగంగా బయటకు రావని అమిత్ షా తెలిపారు. అయితే ప్రతి సమావేశంలో నిర్ణయాలు సమిష్టి సంప్రదింపుల తర్వాత మాత్రమే తీసుకుంటారని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వాన్ని నడపడం కోసం కాకుండా దేశాన్ని మంచిగా మార్చడానికి తాను అధికారంలో ఉన్నట్లు భావిస్తూ ఉంటారని తెలిపారు.

అందువల్ల, ఆయన పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలకు భిన్నంగా కొన్ని సార్లు దేశం, ప్రజల ప్రయోజనాల కోసం కఠినమైన,  ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదని చెప్పారు.  “మీరు నల్లధనాన్ని అరికట్టినప్పుడు, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు, పన్ను ఎగవేతలో అన్ని లొసుగులను మూసివేసినప్పుడు, కొన్ని సంవత్సరాలు మాకు ఓటేసిన వారు బాధపడవచ్చు. బాధపడతారు కూడా” అని స్పష్టం చేశారు. 

అయితే ఇటువంటి నిర్ణయాల ద్వారా ప్రధాని వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం పొందలేరని వారు నెమ్మదిగా అర్ధం చేసుకొంటారని, చివరకు అది దేశనానికి ప్రయోజనం కూడా చేకూరుస్తుందని, అందుకనే అందరూ ఆయనతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారని అమిత్ షా వివరించారు. 

కొన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండటం తమ నాయకత్వపు జన్మహక్కు అని భావిస్తున్నారని,  కానీ ప్రజల-కేంద్రీకృత ,  దేశ ప్రథమ రాజకీయాలపై దృష్టి పెట్టడం ద్వారా మోదీ ఈ ప్రక్రియలో మార్పు తీసుకు వచ్చారని చెప్పారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే ఈ ప్రతిపక్ష పార్టీల స్నేహితులను ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి ఉంటే దానిని బహిర్గతం చేయాలని హోమ్ మంత్రి సవాల్ చేశారు. “మా వైఫల్యాలను ప్రజలకు బహిర్గతం చేయండి. కానీ వ్యక్తిగత దాడులకు పాల్పడటం ద్వారా రాజకీయ ప్రమాణాలను తగ్గించవద్దు” అని ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. 

భారత దేశ ప్రధాన మంత్రుల్లో మోదీ తప్ప ఇతరులెవరూ భారత దేశానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా ఉందని చెప్పలేదని అమిత్ షా గుర్తు చేశారు.  ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరిందని, త్వరలో 5వ స్థానానికి చేరుతుందని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా త్వరలో మారుతుందనే నమ్మకం తనకు ఉందని భరోసా వ్యక్తం చేశారు.