‘మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఓటమి 

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తెలుగు సినిమా నటుల సంఘం  ‘మా’  (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌) ఎన్నికల్లోప్రముఖ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన ప్రత్యర్థి, ప్రముఖ  ప్రకాష్‌రాజ్‌పై 107 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా ప్రకాష్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. 
 
2019లో కేవలం బిజెపిని ఓడించడమే లక్ష్యంగా బెంగుళూరు నుండి లోక్ సభకు పోటీ చేసి, డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిం ప్రకాష్ రాజ్, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓట్ వేయని `మా’ ఎన్నికలలో ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు నాలుగు నెలల క్రితమే ప్రకటినుంచి, పలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. 
 
పైగా ఆయనకు మద్దతు ఇచ్చిన చిరంజీవి సోదరుడు  నాగబాబు సహితం వ్యక్తిగత విమర్శలకు దిగి, ఎన్నికల స్థాయిని దిగజార్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి పోటీచేసిన జీవిత, హేమ వంటి వారు కూడా తరచూ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ మొత్తం ఎన్నికల వాతావరణంలో ఉద్రిక్తలను నింపారు. 
 
దానితో సినీ నటులు పలువురు ప్రతిష్టాకరంగా తీసుకున్నట్లు కనిపిస్తున్నది. ఎప్పుడు సంగం మందికి మించి ఓటింగు జరగని `మా’ ఎన్నికలలో ఈ పర్యాయం 80 శాతంకు మించి ఓటింగ్ జరిగింది. 883 మంది సభ్యులకుగాను రికార్డుస్థాయిలో 673 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్‌ కావడం గమనార్హం.
 
ఇక ‘మా’ జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలుపొందారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన ఆయన జీవిత రాజశేఖర్‌పై 7 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.  ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ విజయం సాధించారు. ఆయన బాబుమోహన్‌పై గెలుపొందారు.
 
విష్ణు ప్యానల్ నుంచి ఉపాధ్యక్షునిగా  మాదాల రవి, కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు గెలుపొందారు. ఇక ్రప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, ఉపాధ్యక్షునిగా బెనర్జీ విజయం సాధించారు. 
 
మంచు విష్ణు ప్యానల్ నుంచి 10 మంది కార్యవర్గ సభ్యులు విజయం సాధించగా, అటు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో 8 మంది కార్యవర్గ సభ్యులు గెలుపొందారు. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ,కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి, అనసూయ, ఖయ్యూం, సంపూర్ణేష్, బ్రహ్మాజీ కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు.

ఇలా ఉండగా, ప్రకాశ్‌రాజ్ ఓడిపోవ‌డంతో నాగబాబు ప్రాంతీయ వాదం,  సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక అసోసియేషన్ లో తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
ఎన్నికైన కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకి చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకంక్ష‌లు తెలిపారు. ఈ ఎన్నికలో గెలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటు పడుతుంది అని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. `మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తి తోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని స్పష్టం చేశారు.
 దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది.