కేసీఆర్‌ మోకాళ్ల మీద నడిచినా ఓట్లెయరు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మోకాళ్ల మీద నడిచినా, మోచేతుల మీద పబ్బతి పట్టినా టీఆర్‌ఎస్‌కు హుజూరాబాద్‌ ప్రజలు ఓట్లు వేయరని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లిలోని హనుమాన్‌ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బత్తినివానిపల్లి, గోపాల్‌పూర్, శనిగరం, మాదన్నపేట, గూనిపర్తి గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..నేను మీకు బక్క పలుచగా కనిపిస్తుండొచ్చని కానీ, చిచ్చర పిడుగునని మాత్రం సీఎం కేసీఆర్‌ మరిచిపోవద్దని కోరారు. ప్రగతి భవన్‌లో ప్లాన్లు వేసేది కేసీఆర్‌ అయితే, వాటిని అమలు చేస్తున్నది హరీశ్‌రావు అని ఆరోపించారు. నయీం లాంటోడే చంపాలని చూసినా తాను భయపడలేదని, తనకు గన్‌మెన్లను తొలగించినంతమాత్రాన భయపడిపోతానా? అని ప్రశ్నించారు.

తాను నమ్ముకున్నది గన్‌మెన్లను కాదని ప్రజలనని స్పష్టం చేశారు. తనకు ఏమైనా జరిగితే ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు యావత్‌ రాష్ట్రం కన్నీరు పెడుతుందని చెప్పారు. దసరాకు మందు, మాంసం, నగదు ఇస్తారని ప్రచారం జరుగుతోందని, అవన్నీ తీసుకుని ఓటు మాత్రం కమలం పువ్వుకే వేయాలని  ఆయన కోరారు. 

‘‘నాపై ఇప్పటి వరకు  నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారు… దళిత బంధు వద్దు అని రాశానని ప్రచారం చేస్తే.. అలాంటి ఉత్తరం రాలేదని చెప్పి ఎన్నికల కమిషన్ చెంప చెళ్లుమనిపించింది..’’  అని రాజేందర్ ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ప్రజలు తలచుకుంటే దొంగల ముఠా తోకముడవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ తో తెలంగాణ తెచ్చుకున్నామని, అయితే ఉద్యోగాలు వాళ్ల కుటుంబానికి వచ్చాయి., కానీ మనకు రాలేదని విమర్శించారు.  మన పిల్లలకు గొర్రె పిల్లలు ఇచ్చి.. ప్రజలు గొర్రెలనుకుంటున్నాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు.   

ఫించన్, దళితబంధు, రేషన్ కార్డు ఇస్తే మోసపోయి ఓటేస్తాడని కేసీఆర్ అనుకుంటాడని, కానీ ఈసారి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటికి ఇద్దరు పట్టభద్రులున్నారని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తే ఉద్యోగాలు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
‘‘కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాదు ఈటల రాజేందర్.. ఎన్నికల రిజల్ట్ తరువాత తెలంగాణలో అగ్గి పెడతా.. కేసీఆర్ పీఠం కూల్చుతా.. యావత్ తెలంగాణ ప్రజలారా మా హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉండండి..’ అని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ప్రజలారా మీరు తలుచుకుంటే దొంగల ముఠా తోకముడవడం ఖాయం అని స్పష్టం చేశారు. 

దళితులను దగా చేస్తే చావు డప్పు 

దళితులను దగా చేస్తే చావు డప్పు కొట్టడం ఖాయమని, టీఆర్ఎస్ వాళ్లు ఈటల రాజేందర్ తో గోక్కొని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్లకి బుల్లెట్ దిగాలని స్పష్టం చేశారు.  
ఈటెల రాజేందర్  ప్రజల మనిషి అని, హుజురాబాద్ ప్రజల మీద నమ్మకం లేక హరీష్ రావు, సిద్దిపేట నియోజకవర్గ  నాయకులను తీసుకువచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ వి లొట్ట పెట్ట పెదవులు అని శోభ ఎద్దేవా చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని  అనలేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళిత బంధు ఇవ్వకపోతే కేసీఆర్ నీకు రాజకీయ సమాధి కట్టుడు ఖాయమని ఆమె హెచ్చరించారు. 
 
ఈనెల 30వ తేదీ తర్వాత  ఇప్పుడు వస్తున్న నాయకులు ఎవరూ కనబడరని, మళ్లీ కనిపించేది, పనిచేసేది మన ఈటల రాజేందర్ మాత్రమే అని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుందాం.. ఓటు మాత్రం మన రాజేందర్ అన్నకు వేసుకుందామని ఆమె సూచించారు. 
 
నీతిగల రాజేందర్ మీద కల్తీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, తాగుబోతులు, లంగలు, లఫంగులు,  బ్రోకర్స్ ను మంత్రి వర్గంలో పెట్టుకొని  ఈటలను బయటికి పంపించిండు కేసీఆర్ అని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చల్లా ధర్మారెడ్డి  చంద్రబాబు చంకలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు.