
భారత వాయు సేన (ఐఏఎఫ్) పోరాటానికి సర్వసన్నద్ధంగా ఉందని చెప్పడానికి తూర్పు లడఖ్‌లో ఎదురవుతున్న పరిణామాలపై సకాలంలో, సరైన విధంగా స్పందిస్తున్న తీరే నిదర్శనమని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హిందోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 89వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు.
తూర్పు లడఖ్‌లో ఎదురవుతున్న పరిణామాలపై సకాలంలో, సరైన రీతిలో స్పందిస్తుండటం ఐఏఎఫ్ పోరాట సన్నద్ధతకు నిదర్శనమని తెలిపారు. భద్రతకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయమని పేర్కొన్నారు. విదేశీ శక్తులు మన భూభాగాన్ని అతిక్రమించడానికి అవకాశం ఇచ్చేది లేదని దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలని తెలిపారు.
తాను చాలా ముఖ్యమైన సమయంలో ఐఏఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. అత్యుత్తమ కమాండర్లకు వారసునిగా తాను బాధ్యతలు చేపట్టడం తనకు గొప్ప గౌరవ కారణమని తెలిపారు. మన ప్రాంతంలోనూ, వెలుపల సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ శక్తుల వల్ల భద్రతా వాతావరణం ప్రభావితమవుతోందని పేర్కొన్నారు
భూమి, సముద్రం, గగనతలం సంప్రదాయ యుద్ధ రంగాలని, ఇప్పుడు మరికొన్ని కొత్త రంగాలు వచ్చాయని, ఫలితంగా సైనిక కార్యకలాపాల్లో సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. యుద్ధం-పోరాటం స్వభావంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు.
అత్యుత్తమ వనరులు, మంచి నాయకత్వం, స్పష్టమైన ఆదేశాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు వాయు సేన మెడల్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి ప్రదానం చేశారు. ప్రఖ్యాత ఆకాశ్ గంగ బృందానికి చెందిన స్కైడైవర్స్ జెండాను పట్టుకుని చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఏఎఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వాయు సేన దినోత్సవాల సందర్భంగా ఎయిర్ వారియర్స్, వెటరన్స్, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అవిభాజ్య భారత దేశంలో 1932 అక్టోబరు 8న ఐఏఎఫ్ ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధంలో నిర్వహించిన పాత్రకు గుర్తింపుగా కింగ్ జార్జ్-6 దీనికి ముందు ‘‘రాయల్’’ను జోడించారు. భారత దేశం గణతంత్ర దేశంగా ఏర్పాటైన తర్వాత 1950లో ‘‘రాయల్’’ను తొలగించారు.
More Stories
సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదు
బుద్ధుడు, ఋషుల సందేశాలలో ఏకరూపత
బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్!